కన్మనూర్​ లో ఉపాధి అక్రమాలపై విజిలెన్స్​ అధికారుల విచారణ

మరికల్​, వెలుగు : మండలంలోని కన్మనూర్​ లో అయిదేండ్ల నుంచి జరిగిన పనులపై, అక్రమాలపై  విజిలెన్స్​ చీఫ్​ అధికారి ఉమారాణి, డిప్యూటీ అధికారి ఉషారాణి  గురువారం  విచారణ జరిపారు.   గ్రామస్థుల సమక్షంలో ఉపాధి హమీ పనుల గ్రామ మానిటరింగ్​  కమిటీని నియమించారు.  ఎక్కువగా కుటుంబసభ్యులు పని చేసినట్లు రికార్డులు చూపించి రూ.లక్షల్లో అవినీతికి పాల్పడ్డారని గ్రామస్థులు, అధికారులకు వివరించారు.  

విచారణ క్రమంలో కొద్ది సేపు గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కలుగ చేసుకుని  శాంతింపజేశారు.  అనంతరం అధికారులు  నర్సరీ, షెడ్ల నిర్మాణాలను పరిశీలించారు.   రాష్ర్టంలోని ప్రతి గ్రామంలో నిఘా కమిటీని నియమించేలా ఆయా జిల్లాల డీఆర్​డీవోలకు తెలుపుతామన్నారు. ఇక్కడ జరిగిన పనులపై నిజ నిజాలు తెలుసుకోవడానికి మాత్రమే వచ్చామని పూర్తి నివేదికను ఉన్నతధికారులకు అందజేస్తామని  వివరించారు. డీఆర్​డీవో మొగులప్ప, ఎంపీడీవోలు కొండన్న, యశోదమ్మ, శ్రీనివాస్​, రమేశ్​​, ఏపీవోలు 
ఉన్నారు.