
జయశంకర్ భూపాలపల్లి/ మహదేవపూర్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలు వెలికితీసేందుకు చేపట్టిన విజిలెన్స్ దాడులకు కొనసాగింపుగా బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. హైదరాబాద్ నుంచి బుధవారం మధ్యాహ్నం మహదేవ్‌పూర్‌లోని కాళేశ్వరం హరిత హోటల్ చేరుకున్న ఆయన.. మేడిగడ్డ బ్యారేజీ ఈఈ తిరుపతి రావు, డీఈ సురేశ్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లంచ్ తర్వాత సుమారు రెండు గంటల పాటు వారితో మాట్లాడి పలు విషయాలపై ఆరా తీశారు. 9వ తేదీ నుంచి11వరకు విజిలెన్స్ ఆఫీసర్లు భూపాలపల్లి జిల్లాలో మూడు చోట్ల తనిఖీలు చేపట్టారు.
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సీజ్ చేసి మూట కట్టుకొని హైదరాబాద్తీసుకెళ్లారు. ఆ సమయంలో పలు కీలకమైన హార్డ్ డిస్క్ లను ఇరిగేషన్ ఆఫీసర్లు ఇవ్వలేదని, వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునేందుకే విజిలెన్స్ డీజీ మళ్లీ జిల్లాలో అడుగుపెట్టారనే ప్రచారం జరుగుతోంది. హరిత హోటల్‌లో ఇంజినీర్లతో భేటీ అనంతరం విజిలెన్స్ డీజీ ఇరిగేషన్ ఆఫీసర్లను వెంట బెట్టుకొని మేడిగడ్డ బ్యారేజీ దగ్గరికి వెళ్లారు. అక్కడ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లోని ఇరిగేషన్ ఆఫీస్ ను తనిఖీ చేసి డాటా సేకరించారు. అనంతరం తిరిగి హరిత హోటల్ కు చేరుకున్న డీజీ మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఎంక్వైరీ చేస్తారని తెలుస్తోంది. నేడు(గురువారం) కన్నేపల్లి పంపు హౌస్ లో కూడా ఆయన తనిఖీలు చేయనున్నట్టు సమాచారం.
అంతా సీక్రెట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ విజిట్ చాలా సీక్రెట్‌గా జరుగుతోంది. ఏ విషయాలు కూడా బయటకు రానివ్వడం లేదు. డీజీ స్థాయి ఆఫీసర్ రావడంతో ఆయనకు పోలీస్ బందోబస్తు కోసం కాటారం డీఎస్పీ రాం మోహన్, మహదేవపూర్ సీఐ కిరణ్, కాళేశ్వరం ఎస్ఐ లక్ష్మణ్ రావు సిబ్బందితో హరిత కాకతీయ హోటల్‌కు చేరుకున్నారు. కాగా కేవలం ఎస్ఐ స్థాయి బందోబస్తు చాలని విజిలెన్స్ డీజీ చెప్పడంతో డీఎస్పీ, సీఐ వెనక్కి వెళ్లిపోయారు. మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కూడా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్ ను చెక్ పోస్ట్ వద్ద డ్యూటీలో ఉంచారు. ఎవరినీ బ్యారేజీ వైపునకు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతలు అప్పగించారు. అటు హరిత హోటల్ వద్ద కానీ ఇటు మేడిగడ్డ బ్యారేజీ వద్ద కానీ మీడియాకు అనుమతి ఇవ్వడం లేదు. రిపోర్టర్లు వివరాలు అడిగినా ఆఫీసర్లు మౌనంగానే ఉంటున్నారు.