- ఇందారం, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
- ప్రజావాణిలో సీఎం రేవంత్‌రెడ్డికి బాధితుల ఫిర్యాదు
- గత ఆర్డీవో వేణు, డీటీ కమల్‌సింగ్‌పై ఆరోపణలు
- రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్‌ను కోరిన విజిలెన్స్ ఉన్నతాధికారులు
- ఎంక్వైరీ ఆఫీసర్‌గా అడిషనల్ కలెక్టర్ రాహుల్ నియామకం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా ఇందారం, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ల భూ సేకరణలో జరిగిన అక్రమాలపై స్టేట్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ కూపీ లాగుతోంది. గతంలో మంచిర్యాల ఆర్డీవోగా పనిచేసిన దాసరి వేణు, డిప్యూటీ తహసీల్దార్ కమల్‌సింగ్ భూ సేకరణలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఇటీవల కొందరు బాధితులు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన ప్రజావాణిలో సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
మొత్తం 15 అంశాల్లో ఆర్డీవో వేణు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ మంచిర్యాల కలెక్టర్ సంతోష్‌ను కోరింది. దీంతో అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించారు. జిల్లా నుంచి ఇచ్చే ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగా విజిలెన్స్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన వేణు ప్రస్తుతం కుమ్రం భీమ్ అసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. కమల్‌సింగ్ ఇటీవలే వేమనపల్లి డిప్యూటీ తహసీల్దార్‌గా బదిలీ అయ్యారు.
15 అంశాల్లో అక్రమాలు
శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్‌టెన్షన్‌లో భాగంగా జైపూర్ మండలం దుబ్బపల్లిలో జరిపిన భూసేకరణలో పలు అక్రమాలు జరిగాయని బాధితులు ప్రజాభవన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం జరిపిన సోషల్ ఎకనామిక్ సర్వేలో అనర్హులకు చోటు కల్పించారని ఆరోపించారు. మొత్తం 168 ఇండ్లకుగానూ 103 ఇండ్లకు మాత్రమే పరిహారం ఇచ్చారని, నాన్ లోకల్స్ పేర్లను లిస్ట్‌లో చేర్చి లోకల్‌గా నివాసం ఉంటున్న వారి పేర్లను తొలగించారని, ఇలా ఒక్కో ఇంటికి రూ.50 వేల నుంచి రూ.80 వేల చొప్పున రూ.50 లక్షల పైచిలుకు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఆర్డీవో ఆఫీస్‌లో భూసేకరణ విభాగంలో పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ కమల్ సింగ్‌ది కీరోల్ అని ఆరోపించారు. అంతకుముందు తాళ్లపల్లి గ్రామంలో 225 మందికి అక్రమంగా పరిహారం ఇచ్చారని, భూసేకరణ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలో వారంతా మైనర్స్ అని, పునరావాస కాలనీల్లో హౌస్ సైట్స్ కేటాయింపుల్లోనూ 11 మంది అనర్హులకు స్థలాలు ఇచ్చారని ఫిర్యాదు చేశారు.
పెరటి స్థలాల నష్టపరిహారాన్ని పట్టాదారులకు తెలియకుండా థర్డ్ పార్టీలకు ఇచ్చి 60 శాతం కమీషన్ తీసుకున్నారని, అన్నారం బ్యారేజీ భూసేకరణకు సంబంధించి 2019లో అవార్డ్ అయిన భూములకు రూల్స్‌కు విరుద్ధంగా సబ్ అవార్డ్ చేశారన్నారు. ఇరిగేషన్ ఆఫీసర్లతో పాటు థర్డ్ పార్టీలతో కుమ్మకై సదరు భూముల్లో బోర్లు, పైప్‌లైన్లు ఉన్నట్లు చూపించి నిధులు దుర్వినియోగం చేశారని ఫిర్యాదు చేశారు.
భూసేకరణ ఫండ్స్ డిపాజిట్లపై..
భూసేకరణకు సంబంధించిన ప్రభుత్వ, సింగరేణి నిధులను ప్రైవేట్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసి కమీషన్లు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమీషన్ల కోసమే ఫండ్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాకు ట్రాన్స్‌ఫర్ చేసి, వడ్డీని పక్కదారి పట్టించారని ఆరోపించారు.
100 ఎకరాలకు ఎన్‌వోసీలు
2016 నుంచి 2022 వరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీవోలు ఎవరూ ఇనాం భూములకు ఎన్‌వోసీలు ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన వేణు హాజీపూర్, నస్పూర్, జైపూర్ మండలాల్లో సుమారు 100 ఎకరాలకు ఎన్‌వోసీలు జారీ చేసి, లక్షల్లో లబ్ధి పొందారన్నారు. ఇన్‌చార్జ్ డీసీఎస్‌వోగా పనిచేసిన టైంలోనూ రైస్ మిల్లర్ల అక్రమాలకు అండగా నిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వివాదాల్లో ఉన్న భూములకు సైతం..
ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎల్లారం శివారులోని సర్వే నంబర్ 43లో గల 13.06 ఎకరాల భూమిపై ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడంతో నష్టపరిహారం చెల్లింపును అంతకుముందున్న ఆర్డీవో రమేశ్ నిలిపివేశారు. కానీ తర్వాత దాసరి వేణు అపోజిట్ పార్టీలకు పరిహారం చెల్లించి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. టేకుమట్ల శివారులోని 516 సర్వే నంబర్‌లో 2.16 ఎకరాలు ఏడీసీసీబీలో 2000 సంవత్సరం నుంచి మార్ట్‌గేజ్‌లో ఉంది. దీంతో పట్టాదారులకు పరిహారం చెల్లించొద్దని బ్యాంక్ ఆఫీసర్లు కోరడమే కాకుండా, హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయినప్పటికీ కమీషన్లు తీసుకొని ఆ పట్టాదారులకు నష్టపరిహారం చెల్లించారన్నారు.