ఫోకస్ ఆన్ కేయూ.. కబ్జాలు తేల్చేందుకు రంగంలోకి విజిలెన్స్

ఫోకస్ ఆన్ కేయూ.. కబ్జాలు తేల్చేందుకు రంగంలోకి విజిలెన్స్
  • కేయూలో కబ్జాలు తేల్చేందుకు  రంగంలోకి విజిలెన్స్  
  • 1956 నాటి సేత్వార్ రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు 
  • నిర్మాణ డాక్యుమెంట్స్ అందించాలని 76 మందికి నోటీసులు  
  • త్వరలో మరికొందరికి జారీ చేసేందుకు టౌన్ ప్లానింగ్ ప్రిపేర్  
  • తాజాగా మరోసారి ఫీల్డ్ విజిట్ చేసిన ఆయా విభాగాల ఆఫీసర్లు 

హనుమకొండ, వెలుగు: వరంగల్ కాకతీయ వర్సిటీ భూముల సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అసోసియేషన్​ఆఫ్​కాకతీయ యూనివర్సిటీ టీచర్స్(అకుట్) ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇటీవలే రెవెన్యూ, సర్వే అండ్​ల్యాండ్​రికార్డ్స్, టౌన్​ప్లానింగ్​ఆఫీసర్ల సమక్షంలో జాయింట్​ఇన్​స్పెక్షన్​చేపట్టి.. వర్సిటీ ల్యాండ్​ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. 

అయితే.. చాలామంది తమది ప్రైవేటు పట్టా ల్యాండ్ అంటూ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మరోసారి మంగళవారం ఆయా విభాగాల అధికారులు ఫీల్డ్​విజిట్​చేశారు. మొత్తంగా వర్సిటీలోని ఆక్రమణలను తేల్చేందుకు 1956 నాటి సేత్వార్​రికార్డులను పరిశీలించే పనిలో పడ్డారు. ఇప్పటికే వర్సిటీ భూములను​ఆక్రమించినట్లు ఆరోపణలున్న కొందరికి టౌన్​ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ప్రస్తుతం హాట్​టాపిక్‎గా మారింది.

సర్వే నంబర్ 229పై జాయింట్ ఇన్​స్పెక్షన్​


వర్సిటీ ఏర్పాటు సమయంలో హనుమకొండ మండలం కుమార్ పల్లి, గుండ్ల సింగారం, పలివేల్పుల శివారుల్లోని 673.12 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో వర్సిటీ భూముల రక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడంతో కుమార్​పల్లి శివారు 229,  214, పలివేల్పుల శివారు 412, 413, 414, లష్కర్​సింగారం శివారు 32 సర్వే నంబర్ల పరిధిలో భారీగా కబ్జాలు అయ్యాయి. ప్రధానంగా కుమార్​పల్లి శివారు సర్వేనంబర్ 229లో వర్సిటీ ల్యాండ్‎లోనే కేయూ అసిస్టెంట్​రిజిస్ట్రార్ పెండ్లి అశోక్​బాబు ఇల్లు నిర్మించుకోవడం వివాదాస్పదమైంది. 

దీంతో వర్సిటీ ల్యాండ్స్‎ను కాపాడాల్సిన ఉన్నతోద్యోగినే కబ్బా చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయనతో పాటు 17 మందికి మున్సిపల్​అధికారులు నోటీసు లు జారీ చేశారు. అప్పట్లో  కేయూ ల్యాండ్స్​కమిటీ మెంబర్‎గా కొనసాగిన అశోక్​బాబును పదవి నుంచి తప్పించారు. తమది పట్టా ల్యాండేనని అశోక్​బాబు వాదిస్తున్న నేపథ్యంలో విజిలెన్స్​సీఐలు అనిల్, రాకేశ్​ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం 229 సర్వే నంబర్‎లో జాయింట్​ఇన్​స్పెక్షన్​నిర్వహించారు.

ఆయన ఇంటి చుట్టు పక్కల ఇండ్ల ల్యాండ్ డాక్యుమెంట్స్ తనిఖీ చేశారు. దీంతో అక్కడ కబ్జాలు అవడమే కాకుండా కొందరు రోడ్డును కూడా ఆక్రమించి కాంపౌండ్లు నిర్మించుకున్నట్లు గుర్తించారు. కాగా.. 2021లో అప్పటి కలెక్టర్​వర్సిటీ భూములపై డీజీపీఎస్​సర్వే డిజిటల్​మ్యాప్, రికార్డ్స్‎ను కూడా పరిశీలించారు. వాటి ప్రకారం చూసినా ఆక్రమణలు వాస్తమేనని గుర్తించినట్లు తెలిసింది.

 ఇదే సరైన సమయం

ప్రస్తుతం వర్సిటీ ఇన్​చార్జ్ వీసీ వాకాటి కరుణ ఉమ్మడి వరంగల్​జాయింట్​కలెక్టర్‎గా ఉన్నప్పుడు కేయూ ల్యాండ్స్​సర్వే చేయించారు. అప్పట్లో పలివేల్పుల శివారులోని 412, 413, 414 సర్వే నంబర్లలో డీ మార్కేషన్​చేపట్టారు. వర్సిటీ జాగాలో నిర్మించిన షెడ్లను తొలగించారు. అనంతరం కూడా ఆక్రమణలు జరిగాయి. ఇక 2021లో హనుమకొండ కలెక్టర్​రాజీవ్​గాంధీ హనుమంతు డీజీపీఎస్​సర్వే చేయించారు.

 కానీ ఫిజికల్‎గా హద్దులు నిర్ణయించకపోగా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇన్నాళ్లకు మళ్లీ సర్వే చేస్తుండగా కబ్జాల వ్యవహారం కొలిక్కి వస్తోంది. వర్సిటీ భూములను కబ్జాల చెర నుంచి కాపాడేందుకు ఇదే సరైన సమయమనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఆఫీసర్లు వెనక్కితగ్గకుండా కబ్జాదారులను వదిలిపెట్టొద్దని విద్యార్థి సంఘాలు డిమాండ్​చేస్తున్నాయి.

76 మందికి నోటీసులు జారీ


పట్టా ల్యాండ్స్​అంటూ కొందరు వాదిస్తుండగా.. ఇక విజిలెన్స్​అధికారులు1956 నాటి సేత్వార్​రికార్డులను పరిశీలించే పనిలో పడ్డారు. వర్సిటీ భూములను సర్వే నంబర్ల వారీగా తనిఖీ చేస్తున్నారు. తహసీల్దార్ ఆఫీసుల నుంచి పాత రికార్డులను తెప్పించుకున్న ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు వర్సిటీ భూములు ఆక్రమించుకున్న వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన అధికారులకు టౌన్​ప్లానింగ్​నోటీసులు జారీ చేస్తోంది. 

పూర్తి డాక్యుమెంట్స్​సమర్పించాలని పేర్కొంటుంది. మంగళవారం నాటికి76 మందికి అందజేసింది. అయితే.. ఇద్దరు అధికారులు తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలిసింది. పలివేల్పుల శివారు సర్వే నంబర్లలో మరికొన్ని ఆక్రమణలున్నట్లు.. వాటికి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తామని మున్సిపల్​అధికారులు స్పష్టంచేశారు.