ఐపీఎల్​ టికెట్ల వివాదంలో విజిలెన్స్‌‌‌‌ ఎంక్వైరీ షురూ

ఐపీఎల్​ టికెట్ల వివాదంలో విజిలెన్స్‌‌‌‌ ఎంక్వైరీ షురూ
  • ఉప్పల్ స్టేడియంలో అధికారుల విచారణ 
  • డీజీ శ్రీనివాస్​ రెడ్డి నేతృత్వంలో రెండు స్పెషల్ టీమ్స్‌‌‌‌ ఏర్పాటు
  • హెచ్‌‌‌‌సీఏ, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌ ప్రతినిధులను విడివిడిగా ప్రశ్నించిన అధికారులు
  • అందుబాటులో లేని హెచ్‌‌‌‌సీఏ అధ్యక్షుడు జగన్​మోహన్ రావు
  • ఐపీఎల్‌‌‌‌ ఒప్పందాలు, నిర్వహణ, టికెట్ల కేటాయింపుల మెయిల్స్‌‌‌‌పై ఆరా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ క్రికెట్ అసోసియేషన్‌‌‌‌ (హెచ్‌‌‌‌సీఏ), -ఐపీఎల్‌‌‌‌ ఫ్రాంచైజీ సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ (ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌) మధ్య తలెత్తిన టికెట్ల వివాదంలో విజిలెన్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ విచారణ మొదలైంది. ఈ వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సోమవారం విజిలెన్స్‌‌‌‌ అధికారులను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి   ఆదేశించారు. ఈ మేరకు విజిలెన్స్ డీజీ శ్రీనివాస్​ రెడ్డి పది మంది సభ్యులతో కూడిన రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం నుంచే దర్యాప్తు ప్రారంభించారు. 

అడిషనల్‌‌‌‌ ఎస్పీ  శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, డీఎస్పీ రవికుమార్‌‌‌‌ నేతృత్వంలో నలుగురు ఇన్‌‌‌‌స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన విజిలెన్స్‌‌‌‌ అధికారుల బృందం ఉదయం 11 గంటలకు ఉప్పల్‌‌‌‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్‌‌‌‌ క్రికెట్ స్టేడియానికి చేరుకున్నది. హెచ్‌‌‌‌సీఏ ఆఫీసులో రాత్రి 8 గంటల వరకు విచారణ జరిపింది. సెలవురోజు కావడంతో స్టేడియానికి రావాల్సిందిగా ఆఫీస్ బేరర్లకు  సమాచారం ఇచ్చారు. హెచ్‌‌‌‌సీఏ సభ్యుల సమక్షంలో పలు రికార్డులను పరిశీలించారు.

రెండు గ్రూపుల స్టేట్‌‌‌‌మెంట్స్​ రికార్డ్‌‌‌‌

హెచ్‌‌‌‌సీఏ, సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ ప్రతినిధులను వేర్వేరుగా ప్రశ్నించారు. ముందుగా హెచ్‌‌‌‌సీఏ సెక్రటరీ దేవరాజు, జాయింట్‌‌‌‌ సెక్రటరీ బస్వరాజు, ట్రెజరర్‌‌‌‌ సీజే శ్రీనివాస్‌‌‌‌ను విజిలెన్స్‌‌‌‌ అధికారులు విచారించారు. ఆ తర్వాత  ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ సీఈవో షణ్ముగం, ప్రతినిధులు కిరణ్‌‌‌‌, శరవణన్‌‌‌‌, రోహిత్‌‌‌‌ సురేశ్‌‌‌‌ నుంచి వివరాలు సేకరించారు. వారు వెల్లడించిన వివరాల ఆధారంగా సంబంధిత రికార్డులను, అగ్రిమెంట్లకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు.

 ప్రధానంగా ఐపీఎల్‌‌‌‌ నిర్వహణకు సంబంధించి హెచ్‌‌‌‌సీఏకు, సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌కు మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు, 2013 నుంచి ఐపీఎల్‌‌‌‌ నిర్వహణకు అనుసరిస్తున్న పద్ధతులు, టిక్కెట్ల పంపిణీ, స్టేడియంలో వసతులు కల్పించడంలో ఎవరి పాత్ర ఏంటి? ఐపీఎల్‌‌‌‌ ఉచిత పాస్‌‌‌‌లకు సంబంధించి కేటాయింపులు?  తదితర అంశాలపై వివరాలు సేకరించారు. ఆఫీస్ బేర్లర్లు చెప్పిన వివరాలను స్టేట్‌‌‌‌మెంట్ల రూపంలో రికార్డ్ చేసుకున్నారు. ఐపీఎల్ సమయంలో స్టేడియం నిర్వహణ, మరమ్మతులు సహా ఇతర ఏర్పాట్లలో ఎవరి బాధ్యత ఏంటి? అనే కోణంలో విచారణ సాగింది. 

ఐపీఎల్‌‌‌‌ టికెట్ల కేటాయింపుల్లో ఎవరి వాటా ఎంత?  

ఐపీఎల్‌‌‌‌ నిర్వహణ కోసం హెచ్‌‌‌‌సీఏకు చెల్లించాల్సిన ఫీజు, ఎవరెవరికి ఎంత శాతంలో టికెట్లు కేటాయిస్తారనే వివరాలను అధికారులు రికార్డ్‌‌‌‌ చేసుకున్నారు. ఒప్పందం, ఐపీఎల్‌‌‌‌ ముగిసిన తర్వాత ఏడాదిలో ఎంతకాలం స్టేడియంపై ఎలాంటి హక్కులు ఉంటాయనే వివరాలను తెలుసుకున్నారు. వివాదానికి తలెత్తిన ప్రధాన కారణమేంటని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి అధికారికంగా రాసిన ఈ -మెయిల్స్‌‌‌‌, అందుకు ప్రతిగా హెచ్‌‌‌‌సీఏ ఇచ్చిన సమాధానాలు ఏంటి? అనే వివరాలకు సంబంధించిన రికార్డులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. హెచ్‌‌‌‌సీఏ అధ్యక్షుడు జగన్​మోహన్​రావు  బెదిరింపులకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా? అనే కోణంలో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ ప్రతినిధుల నుంచి సమాచారం సేకరించారు. 

ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల నిర్వహణతో పాటు హెచ్‌‌‌‌సీఏ రోజువారీ కార్యకలాపాలు, స్టేడియం నిర్వహణ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం  సేకరించారు. బుధవారం మరోమారు ఉప్పల్‌‌‌‌ స్టేడియం, హెచ్‌‌‌‌సీఏ ఆఫీసులో విజిలెన్స్‌‌‌‌ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉంది. విచారణ అనంతరం పూర్తి డాక్యుమెంట్లతో సహా వివాదానికి గల కారణాలకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేశారు.