శాతవాహన వర్సిటీ మాజీ వీసీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ

శాతవాహన వర్సిటీ మాజీ వీసీ అక్రమాలపై  విజిలెన్స్ విచారణ
  •     పలువురి ఫిర్యాదులతో విచారణకు ఆదేశించిన సర్కార్
  •     ఎగ్జామినేషన్ బ్రాంచ్, స్టాఫ్ నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు

కరీంనగర్, వెలుగు :​ శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ హయాలో జరిగిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై సర్కార్ విచారణకు ఆదేశించింది. టెండర్ లేకుండా వరుసగా రెండేండ్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులు అప్పగించడం, అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా రిటైర్డ్ ప్రొఫెసర్లను నియమించడం, నాన్ టీచింగ్ స్టాఫ్ లెక్కల్లో అనుమానాలపై గతంలో ‘వీ6 వెలుగు’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే మాజీ వీసీ మల్లేశ్​హయాంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో అవకతవకలకు పాల్పడడం, నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పెట్టి యూనివర్సిటీ సొమ్మును స్వాహా చేయడంలాంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారని కోట శ్యాం, బెల్లపు కర్ణాకర్ అనే ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

ఆరోపణలివే.. 

గత ప్రభుత్వ పెద్దల సిఫార్సుతో జీవోలను తుంగలో తొక్కి పదుల సంఖ్యలో నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించడం వివాదాస్పదంగా మారింది. యూజీసీ రూల్స్​కు విరుద్ధంగా రిటైర్డ్ అధ్యాపకులను అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా నియమించడం, యూజీసీకి తప్పుడు నివేదికను సమర్పించి అక్రమంగా 12బీ గుర్తింపు పొందడమేగాక అక్రమాలను ప్రశ్నిస్తున్నారని ఐదుగురు కాంట్రాక్టు లెక్చరర్లను తొలగించడంపై శ్యాం, కర్ణాకర్ ఫిర్యాదు చేశారు. వర్సిటీ వాహనాల కొనుగోలు, యాక్సిడెంట్ల ఖర్చుల మీద, చలాన్ల మీద ఎంక్వైరీ చేయాలని కోరారు. అర్హత లేని ఎం.రవీందర్ అనే రిటైర్డ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ను ఫైనాన్స్ ఆఫీసర్​గా, వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ జె.ప్రభాకర్ రావును అపాయింట్ చేసుకోవడంపై ఫిర్యాదు చేశారు.

పరిపాలన భవనం ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో సరైన ప్రమాణాలు, నాణ్యత పాటించలేదని, వర్సిటీకి చెందిన ఫిక్సుడ్​ డిపాజిట్లను రూ.కోట్లలో ఖర్చు చేశారని ఆరోపించారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్​లో పేపర్ లీకేజీలు, ఎగ్జామ్ బ్రాంచ్ నుంచి జవాబు పత్రాలు బయటికి వెళ్లడం, టెండర్ లేకుండానే పరీక్ష జవాబు పత్రాల స్కానింగ్ పనులను కోసిన్ అనే సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పజెప్పడంపై విచారణ జరపాలని కోరారు.

ఎగ్జామినేషన్ బ్రాంచ్​లో 2015 నుంచి తిష్టవేసిన ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ ఎన్వీ శ్రీరంగ ప్రసాద్ పై విచారణ చేపట్టి తొలగించాలని కోరారు. 2021-–22, 2022–-23 సంవత్సరాల్లో జరిగిన ఆడిట్ రిపోర్టులపై విచారణ చేయాలన్నారు.  బోధనేతర సిబ్బంది పీఎఫ్ డబ్బులను పీఎఫ్ ఖాతాలో జమ చేయకపోవడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.