- హెల్త్ సిటీ వ్యయాన్ని 56 శాతం,
- టిమ్స్‌ల వ్యయాన్ని 33 శాతం
- పెంచిన గత బీఆర్ఎస్ సర్కార్
- ఆర్‌అండ్‌బీ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం
- ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఆదేశం
హైదరాబాద్, వెలుగు:వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించారు. అంచనా వ్యయాల పెంపునకు సంబంధించిన ఫైల్స్ ఏవీ లేకపోవడం, మౌఖిక ఆదేశాల మీదనే అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడంపై ఫైర్ అయ్యారు. సరైన కారణాలు, పేపర్ వర్క్ లేకుండా ఎట్లా పెంచుతారని హాస్పిటళ్ల నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఆర్ అండ్ బీ అధికారులను సీఎం నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి, తనకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు.
Also Read:-అంచనా వ్యయం పెరిగితే.. ఆయకట్టు ఎందుకు తగ్గినట్టు ?
ఈ మేరకు మూడు రోజుల క్రితం సీఎం ఆదేశాలు ఇవ్వగా, విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఆరోగ్యశాఖపై మూడ్రోజుల క్రితం సీఎం రివ్యూ చేశారు. ఈ సమావేశంలో హాస్పిటళ్ల నిర్మాణాల అంశం ప్రస్తావనకు వచ్చింది. అంచనాలను భారీగా పెంచడంపై ఈ ఏడాది జూన్ చివరిలో వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ అంశంపై ఆయన ఆరా తీశారు. అంచనాలపై పెంపుపై ఆర్ అండ్ బీ అధికారులు సహేతుకమైన కారణాలు చూపకపోవడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు.
రూ.1100 కోట్ల నుంచి రూ.1726 కోట్లకు
వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణానికి 2021 డిసెంబర్ 4న ప్రభుత్వం జీవో 158 విడుదల చేసింది. హెల్త్ సిటీ నిర్మాణానికి రూ.1100 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. సివిల్ వర్క్స్, పారిశుద్ధ్యం, మంచినీరు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, హాస్పిటల్‌కు అవసరమైన ఎక్విప్‌మెంట్, ఇతర అన్ని పనులకు కలిపే ఇంత మొత్తం అవసరం అవుతాయని స్పష్టంగా తెలిపింది. ఆ వెంటనే హెల్త్ సిటీ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.
ఏడాది తర్వాత ఓసారి, ఆ తర్వాత మరోసారి అంచనా వ్యయాన్ని సవరిస్తూ పోయారు. రెండు టర్మ్‌ల్లో కలిపి ఏకంగా 56 శాతం అంచనా వ్యయాన్ని పెంచేశారు. రూ.1100 కోట్ల వ్యయం కాస్తా, రూ.1726కు పెరిగిపోయింది. ఇందుకు సంబంధించిన జీవోలను గత ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. రేవంత్ సర్కార్ వచ్చాక హాస్పిటళ్ల నిర్మాణంపై రివ్యూ చేయడంతో, అడ్డగోలు పెంపు కథ బయటకొచ్చింది. పెరిగిన అంచనా వ్యయంలో సెరామిక్ టైల్స్ కొనుగోలుకే సుమారు రూ.వంద కోట్లు వ్యయాన్ని పెంచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రూ.883 కోట్లు పెరిగిన టిమ్స్‌ల వ్యయం
ఒక్క వరంగల్ హెల్త్ సిటీ మాత్రమే కాదు, హైదరాబాద్ నిర్మిస్తున్న మూడు టిమ్స్‌ల అంచనా వ్యయాన్ని కూడా భారీగా పెంచినట్టు కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. కొత్తపేట, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్‌ల నిర్మాణానికి 2022 ఏప్రిల్‌లో జీవో ఇచ్చారు. కొత్తపేట టిమ్స్‌కు రూ.900 కోట్లు, సనత్‌నగర్ టిమ్స్‌కు రూ.882 కోట్లు, అల్వాట్ టిమ్స్‌కు రూ.897 కోట్ల అంచనా వ్యయాన్ని చూపించారు.
మొత్తం మూడు హాస్పిటళ్ల నిర్మాణానికి రూ.2679 కోట్ల అంచనా వ్యయం ఉండగా, ఏడాదిలోనే దీన్ని సుమారు రూ.3562 కోట్లుకు పెంచారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు, అనుబంధ హాస్పిటళ్ల నిర్మాణ పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి అంచనాల వ్యయాల పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది.