- బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగంపై లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు
- కరీంనగర్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, స్మార్ట్ సిటీ వర్క్స్ శానిటేషన్ సెక్షన్ లో డీజిల్ వినియోగంపై ఆరా
- అధికారులు, కాంట్రాక్టర్లలో టెన్షన్
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ సిటీలో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జరిగిన అభివృద్ధి పనుల్లో నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పనుల అంచనా, టెండర్లు, మంజూరైన నిధులు, చేసిన ఖర్చుపై ఎంక్వయిరీ జరుపుతున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కొన్నేళ్లుగా మున్సిపాలిటీ శానిటేషన్ విభాగంలో డీజిల్ వినియోగంలోనూ గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తుండడంతో ఎంక్వైరీకి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులు, నిధుల ఖర్చుపై పనులవారీగా దర్యాప్తు జరుగుతుండడంతో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లలో టెన్షన్ మొదలైంది.
గెస్ట్ హౌస్ అంచనా రూ.7.05 కోట్లు, వ్యయం రూ.13 కోట్లు
కరీంనగర్ సిటీలో నిర్మించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి తొలుత రూ.7.05 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే బిల్డింగ్ పూర్తయ్యే వరకు సుమారు రూ.13 కోట్లు ఖర్చు పెట్టారు. 11 నెలల క్రితం అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ బిల్డింగ్ ను ప్రారంభించారు. అప్పటి వరకు రూ.6 కోట్ల వరకే టెండర్లు పిలిచిన ఆర్ అండ్ బీ అధికారులు.. సుమారు రూ.7 కోట్ల పనులకు మాత్రం బిల్డింగ్ ప్రారంభోత్సవం అయ్యాక టెండర్లు ఖరారు చేశారు. అంటే రూ.7 కోట్ల పనులను ముందే పూర్తి చేసి ఆ తర్వాత టెండర్లు పిలవడంపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు ఆర్ అండ్ బీ ఇంజనీర్లను విచారించి వివరాలు సేకరించారు. బిల్డింగ్ టెండర్లు, కేటాయింపు, నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు సమాచారం.
డీజిల్ కుంభకోణంపై ఎంక్వైరీ
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో చెత్త సేకరణ వాహనాలు, ట్యాంకర్లలో డీజిల్ వినియోగంలో ఎక్కువ లెక్కలు చూపిస్తూ ఏటా కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో శానిటరీ సూపర్ వైజర్ రాజ్ మనోహర్ పాత్రపై దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ నాయకుడు ఎండీ అమీర్, తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్ ఆర్డీఓ కె.మహేశ్వర్ ను విచారణాధికారిగా నియమించారు.
స్మార్ట్ సిటీ పనుల నాణ్యతపై ఫిర్యాదులు
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఎంపికైన కరీంనగర్ సిటీలో సుమారు రూ.వెయ్యి కోట్లతో పనులు చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదులు అందడంతో సర్కార్ మారగానే డిసెంబర్ 18, 19న విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ, ఫుట్ పాత్ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. ఇప్పటికే సర్కార్ కు విజిలెన్స్ నివేదిక అందగా.. త్వరలో చర్యలు తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అష్యూరెన్స్ ఫండ్స్ రూ.125 కోట్లతో రోడ్లు, డ్రెయినేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనులపైనా బీఆర్ఎస్ లీడర్, మాజీ మేయర్ రవీందర్ సింగే కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పనులపైనా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.