- ఎలక్షన్లకు ముందు జరిగిన పనులపై ఎంక్వైరీ
- పలు డిపార్ట్ మెంట్ల అధికారులపై చర్యలకు రంగం సిద్ధం
- పదుల సంఖ్యలో ఉద్యోగులకు షోకాజ్‌నోటీసులు జారీ!
- కాంట్రాక్టర్‌పై జరిమానా రూ.2కోట్ల నుంచి రూ.21 లక్షలకు తగ్గింపు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కలకలం సృష్టిస్టోంది. కార్పొరేషన్ లోని వివిధ విభాగాల్లోని సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో అన్ని విభాగాల సిబ్బందిపై ఒకేసారి చర్యలకు రంగం సిద్ధం కావడంతో ఉద్యోగులతో పాటు కార్పొరేషన్ లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కార్పొరేషన్ పరిధిలో జరిగిన కోట్లాది రూపాయల విలువైన పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది.
ఒకే కాంట్రాక్టర్‌కు రూ.20 కోట్లకు పైగా విలువైన పనులు చేయడంతో పాటు పనుల నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో కొద్దినెలల కింద కార్పొరేషన్ఆఫీస్లో విజిలెన్స్అధికారులు వచ్చి ఫైళ్లను పరిశీలించడంతో పాటు ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు.
సీసీ పనుల్లో రోడ్ల స్ట్రెంగ్త్ ను పరిశీలించారు. క్వాలిటీ లేకపోవడం, స్ట్రెంగ్త్ రాకపోవడంతో చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. నిర్లక్ష్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్ పై యాక్షన్ తీసుకోకుండా అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సిద్ధమయ్యారు.
కాంట్రాక్టర్ పై జరిమానా తగ్గింపు!
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏడాది జరిగిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనుల నాణ్యతపై పలు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో ఒక ముఖ్యనేతకు బినామీగా ప్రచారం జరిగిన ఒక కాంట్రాక్టర్ కే పెద్ద సంఖ్యలో పనులు దక్కాయన్న విమర్శలున్నాయి. పనుల్లో క్వాలిటీ లేకుండా చేయడంతో పాటు అధికారులను మేనేజ్ చేసుకుంటూ బిల్లులు చేయించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆర్నెళ్ల కింద వారం రోజులకు పైగా విజిలెన్స్ అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీతో పాటు రికార్డులను పరిశీలించారు. ఆ సమయంలో సీసీ రోడ్లు స్ట్రెంగ్త్ రాకపోవడంతో కాంట్రాక్టర్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించినట్టు సమాచారం. అయితే తాజాగా వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ లో మాత్రం ఆ జరిమానాను రూ.21 లక్షలకు తగ్గించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేయాలని సిఫారసు చేసినట్టు సమాచారం.
కాంట్రాక్టర్‌కు సహకరించిన కొంతమంది ఉన్నతాధికారులను, బిల్లులు, ఫైళ్లపై సంతకాలు పెట్టిన ఆఫీసర్లను మినహాయించి కింది స్థాయిలోని ఈఈ, డీఈ, ఏఈ సహా సిబ్బందిపై షోకాజ్ నోటీసులు, చర్యలకు సిఫారసు చేయడం వెనుక మతలబేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టర్ చేసిన పనులను పరిశీలించాల్సిన వర్క్ ఇన్స్ పెక్టర్లు చాలా మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది కావడంతో కాంట్రాక్టర్లకు అనుకూలంగా రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం.
ఆ తర్వాత వర్క్ లను తనిఖీ చేయాల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది కూడా కాంట్రాక్టర్ మామూళ్ల మత్తులో పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంతో చకచకా ఫైళ్లు కదిలి బిల్లులు పాస్ అయ్యాయి. అయితే ఇప్పుడు మాత్రం కాంట్రాక్టర్ ను కాపాడేలా, ఉన్నతాధికారులను తప్పిస్తూ కింది స్థాయి సిబ్బందిని బాధ్యులను చేసేలా విజిలెన్స్ రిపోర్ట్ రావడం వెనుక చక్రం తిప్పిందెవరు అనే చర్చ జరుగుతోంది.