
- శాంక్షన్ లేకుండా ఖర్చు.. విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి
- ఆరు నెలల్లో అంచనాలు రెండింతలు..
- విచారణ లేకుండానే అంగీకరించిన గత ప్రభుత్వం
- టెండర్లు పిలవకుండా నామినేషన్‌పై అప్పగింత
- ప్రభుత్వానికి అందిన విజిలెన్స్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో కట్టిన సెక్రటేరియెట్‌కు ఖర్చు చేసిన నిధులు, నిర్మాణం, ఐటీ పరికరాల కొనుగోళ్లలో భారీగా గోల్మాల్ జరిగినట్లు తేలింది. రూల్స్‌కు విరుద్ధంగా వందల కోట్ల రూపాయలు చెల్లించినట్లు విజిలెన్స్ ఎంక్వైరీలో తేల్చారు. కొన్ని నెలల కింద సెక్రటేరియెట్ నిర్మాణం, ఐటీ పరికరాల కొనుగోళ్లపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణలో సెక్రటేరియెట్‌లో ఏర్పాటు చేసిన ఐటీ పరికరాల కొనుగోళ్లలో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ఐటీ పరికార కొనుగోళ్లపై విజిలెన్స్ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది.
ఆ రిపోర్టులో సెక్రటేరియట్‌లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ.325 కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది. శాంక్షన్లు లేకుండానే బిల్లులు మంజూరు చేసి.. ఫండ్స్ రిలీజ్ చేసినట్లు గుర్తించింది. టెండర్లు లేకుండా.. నామినేషన్ పద్ధతిలో ఐటీ పరికరాల కొనుగోళ్లు అప్పగించగా.. వాటి కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది.
ఎలాంటి టెండర్లు పిలవకుండానే అత్యవసర పనులంటూ నామినేషన్ విధానంలో కేటాయించడం, పైగా, కొనుగోలు చేసిన పరికరాల ధరలనూ మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వేసినట్లు తెలిసింది. సెక్రటేరియెట్ క్యాంపస్ ఏరియా నెట్‌వర్క్ (స్కాన్) ఏర్పాటుతోపాటు ఇంటర్‌నెట్, ఇక్కడి అన్ని శాఖలు, శాఖాధిపతులు, ఐఏఎస్ అధికారులకు కావాల్సిన కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలను సమకూర్చాల్సిన బాధ్యతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) శాఖకు అప్పగించారు.
మొత్తం భవనంలో ఐటీ పనులు చేపట్టేందుకు రూ.180 కోట్ల ఖర్చవుతుందని రెండేళ్ల కింద అంచనా వేశారు. ఈ మేరకు ఐటీ శాఖ అప్పట్లో చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే 6 నెలల తర్వాత పరికరాలకు అంచనా వేసిన మొత్తం కంటే డబుల్ ఖర్చు అవుతుందంటూ ఐటీ శాఖ మరో ప్రతిపాదన పంపింది. దీనిపై ఎలాంటి విచారణ చేయకుండానే గత ప్రభుత్వం సవరణ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపింది.