- రామగుండంలో వాహనాల కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణ
- జాప్యానికి బాధ్యులెవరో తేల్చని ఎంక్వైరీ
- రూ.7.13కోట్లతో స్వచ్ఛ ఆటోలు, కాంపాక్టర్బిన్స్, జేసీబీల కొనుగోలుకు ఆర్డర్
- ఇప్పటివరకు కొన్ని వాహనాలే చేరాయి
- రిజిస్ట్రేషన్చేయించకపోవడంతో మూలన పెట్టేశారు
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో స్వచ్ఛ వాహనాల కొనుగోలుకు రెండేండ్ల కింద ఆర్డర్ పెట్టినా అవి నేటికీ బల్దియాకు చేరలేదు. పట్టణ ప్రగతి, 14వ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.7.13కోట్లతో ఆగ్రోస్ సంస్థ ద్వారా వాహనాలు కొన్నట్లు రికార్డుల్లో నమోదైంది. కాగా కొనుగోళ్లలో జాప్యంపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టింది. కాగా ఆర్డర్ పెట్టిన వాహనాల్లో కొన్ని ఇప్పుడిప్పుడే చేరుకుంటుండగా వాటికీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. 50 కాంపాక్టర్ బిన్స్ ఇంకా రావాల్సి ఉంది.
టీఎస్ ఆగ్రోస్ ద్వారా కొనుగోలు...
రామగుండం బల్దియాలో శానిటేషన్ అవసరాల దృష్ట్యా 50 స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ట్రక్ మౌంటెట్ గార్బేజ్ కాంపాక్టర్లు, కాంపాక్టర్ బిన్‌లు, ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మిషన్, లిట్టర్ పిక్కర్, వైకుంఠరథాలు, రెండు పోర్టబుల్ కాంపాక్టర్లు, ఒక ఎక్స్‌కవేటర్, బాబ్‌కాట్ మిషన్, రాడింగ్ మిషన్, జేసీబీ, స్కై లిఫ్టర్, తదితర వాహనాలను కొనుగోలుకు రూ.6.25 కోట్ల 14వ ఫైనాన్స్, రూ.88 లక్షల పట్టణ ప్రగతి నిధులు మొత్తంగా రూ.7.13 కోట్లను వెచ్చించారు. ఈ వెహికిల్స్‌ను 2020 జూన్ నుంచి 2021 ఏప్రిల్మధ్య కాలంలో ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసినట్టు రికార్డుల్లో నమోదయ్యాయి. అయితే వీటిలో రెండు నెలల క్రితం రూ.30 లక్షల విలువ చేసే జెట్టింగ్ రాడ్ మిషన్, రూ.45 లక్షల విలువ చేసే ట్రక్ మౌంటెడ్ గార్బేజ్ కంపాక్టర్ తీసుకువచ్చారు. నెల రోజుల క్రితం రూ.1.59 కోట్ల విలువ చేసే జేసీబీ, స్కై లిఫ్టర్, బాబ్ కాట్ మిషన్ వెహికిల్స్ బల్దియాకు చేరుకున్నాయి. ఇంకా 50 కాంపాక్టర్ బిన్స్ రావాల్సి
ఉంది.
ALSO READ: సెంట్రల్ బ్యాంక్ రైటాఫ్‌లు 7,856 కోట్లు
రెండు సార్లు ఎంక్వైరీ..
రామగుండం కార్పొరేషన్‌లో వెహికిల్స్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ రెండు సార్లు ఎంక్వైరీ చేసింది. 2023 ఫిబ్రవరి 17, మార్చి 27న బల్దియాలో ఆఫీసర్లు రికార్డులు తనిఖీలు చేశారు. ఎన్ని వాహనాలు కొన్నారు, ఎన్నింటికి బిల్లులు చెల్లించారు, ఏయే కంపెనీల నుంచి ఎస్టిమేషన్ తీసుకున్నారు, ఇప్పటి వరకు ఎన్ని వాహనాలు వచ్చాయి, వాటికి చెల్లించిన బిల్లులు, గతంలో నడిచిన వెహికల్స్‌కు వాడిన డీజిల్, తదితర అంశాలపై విజిలెన్స్ టెక్నికల్ టీం పరిశీలించింది. కొన్న వాహనాల్లో కొన్ని రాలేదని తేలడంతో బల్దియాకు నోటీసులు కూడా ఇచ్చారు. ఓ వైపు విచారణ సాగుతుండగానే ఒక్కొక్కటిగా వెహికల్స్ కార్పొరేషన్ ఆఫీస్‌లో ప్రత్యక్షమయ్యాయి. రెండేండ్లుగా వాహన కొనుగోళ్ల విషయంలో పాలకవర్గం ఎందుకు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు వాహన కొనుగోళ్ల జాప్యంలో బాధ్యులెవరనేది తేల్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని కొందరు కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎవరిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
రిజిస్ట్రేషన్ చేయించక రోడ్డెక్కలే..
విజిలెన్స్ ఎంక్వైరీతో బల్దియాకు చేరిన కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో అవి రోడ్డెక్కలేదు. కార్పొరేషన్ ఆఫీస్ వెనకాల మూలన పడేయడంతో అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టి పనికిరాకుండా పోతున్నాయి. కొత్త వాహనాల కోసం కనీసం షెడ్డు నిర్మించలేని స్థితిలో యంత్రాంగం ఉంది. ఓ వైపు రెండేండ్లు ఆలస్యంగా రాగా, వచ్చిన వాటిని కూడా ఉపయోగించడం లేదు.