- మల్కపేట రిజర్వాయర్ పై కూడా..!
- కరీంనగర్ జిల్లాలో ఫైళ్లనుసీజ్ చేసిన ఆఫీసర్లు
- హైదరాబాద్‌కు ఫైళ్ల తరలింపు
కరీంనగర్, వెలుగు: మిడ్ మానేర్, కొండ పోచమ్మ సాగర్, మల్కపేట రిజర్వాయర్ పనుల్లో అంచనా వ్యయాన్ని పెంచడంపై విజిలెన్స్ ఎంక్వైరీ వేగంగా సాగుతున్నది. విజిలెన్స్ ఆఫీసర్లు గత రెండ్రోజులుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఇరిగేషన్ ఆఫీసుల్లో ఆయా ప్యాకేజీలకు సంబంధించిన ఫైళ్లను సీజ్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.
ప్యాకేజీ 14లోని కొండపోచమ్మ సాగర్ అప్రోచ్ చానల్, కెనాల్, పంప్ హౌస్ పనుల అంచనాను రూ.1,332 కోట్ల నుంచి రూ.2,281 కోట్లకు పెంచడం ద్వారా నాటి ఈఎన్సీ మురళీధర్ రావు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్యాకేజీ 9లో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్ పనుల్లో రూ.79 కోట్లు అదనంగా చెల్లింపులు చేశారని సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కూస రవి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఫిర్యాదు చేశారు. మిడ్ మానేరు పనుల్లోనూ కాంట్రాక్ట్ సంస్థకు సహకరించి, అగ్రిమెంట్, ప్రొసీజర్ పాటించకపోవడం వల్ల ఖజానాకు రూ.224.70 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.
పరిపాలన అనుమతుల్లేకుండా టెండర్లు
2016 సెప్టెంబర్ 25న మిడ్ మానేరుకు 22 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్ వే గేటు పక్కన ఉన్న మట్టికట్ట కొట్టుకుపోయింది. అగ్రిమెంట్ ప్రకారం.. పనులు పురోగతిలో ఉండగా ఏదైనా నష్టం జరిగితే.. ఆ నష్టాన్ని సంబంధిత కాంట్రాక్టరే భరించాలి. కానీ కాంట్రాక్ట్ ఏజెన్సీ రాజరాజేశ్వరి కన్‌స్ట్రక్షన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బండ్, స్పిల్ వే పునరుద్ధరణకు పరిపాలన అనుమతుల్లేకుండానే మరో రూ.224 కోట్లు కేటాయించి.. టెండర్లు పిలిచారు. ఆ పనులను కూడా అదే కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు.
అంతేకాకుండా స్పిల్ వే రైట్ సైడ్ పార్ట్‌కు పాత రేట్ల ప్రకారం పనులు అప్పగించి.. లెఫ్ట్ సైడ్ పనులకు రేట్లు పెంచి అప్పగించారు. అగ్రిమెంట్‌ను పక్కనపెట్టడం, ప్రొసీజర్ పాటించకుండా కాంట్రాక్టర్/ఏజెన్సీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.224 కోట్ల నష్టం వాటిల్లినట్లు కాంగ్రెస్ లీడర్ కూస రవీందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 14లో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు ఎత్తిపోసేందుకు చేపట్టిన కన్వేయర్ సిస్టమ్ (అప్రోచ్ చానల్, టన్నెల్, సర్జ్ పూల్, పంప్ హౌస్)ను మార్చడంతో అంచనాలు పెరిగిపోయాయి.
ఈఎన్సీ మురళీధర్ రావు తొలుత రూ.1,332 కోట్లు అంచనా వేయగా.. మళ్లీ రూ.2,281 కోట్లకు పెంచారు. తర్వాత టన్నెల్ సిస్టం రద్దు చేసి ఓపెన్ కెనాల్, పంపులు, మోటార్లతో రెండు దశల్లో పంపింగ్ విధానం తీసుకొచ్చి మళ్లీ అంచనా వ్యయాన్ని సవరించి రూ.2,895.40 కోట్లకు పెంచారు. పంపులు, మోటార్ల రేట్లను అసాధారణ రీతిలో పెంచడం, ప్రాజెక్ట్ రీడిజైన్‌తో అంచనాలు భారీగా పెరిగి రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.1,600 కోట్ల నష్టం వాటిల్లింది. మల్కపేట రిజర్వాయర్ పనుల్లో కాంట్రాక్టర్లకు రూ.79.13 కోట్లు అదనంగా చెల్లించినట్లు తెలిసింది.