భైంసా, వెలుగు : స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లోని దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు ఎం. రవీంధర్, సీఐ తిరుపతి మంగళవారం తనిఖీలు చేశారు. షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలతో వస్తువులు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావడంతో తనిఖీ చేసినట్టు తెలిపారు. అగ్రిమెంట్లో లేని వస్తువులు కూడా అమ్ముతున్నట్టు గుర్తించామని, పరిశుభ్రత, రూల్స్ పాటించని 6 షాపులకు జరిమానా విధించినట్టు తెలిపారు. తనిఖీల్లో డీఎం అమృత, సిబ్బంది దామోదర్, భగవంత్‌రావు, రమణ తదితరులున్నారు.
బీడీ కార్మికులందరికీ ఫించన్లు ఇవ్వాలి
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: పోడు భూముల సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని ఐటీడీఏ పీఓ కె. వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ మీటింగ్ హాల్లో డీఎఫ్ఓ రాజశేఖర్‌తో కలిసి పోడు భూముల సర్వే పై మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సభలు నిర్వహించే ముందు చాటింపు వేయించాలని, సభకు హాజరైన వారి అటెండెన్స్ తప్పక తీసుకోవాలని సూచించారు. సాగులో ఉన్నవాటికి మాత్రమే చట్ట ప్రకారం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇస్తామని చెప్పారు. గ్రామాల్లో కొత్తగా పోడు చేస్తే పట్టాలు ఇస్తారనే భావన ఉందని, ఇది పూర్తిగా తప్పని పేర్కొన్నారు. కొత్తగా పోడు చేస్తే వారికి మంజూరైన పట్టాలను రద్దు చేస్తామని, రైతుబంధును నిలిపివేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాథోడ్ రమేష్, జడ్పీ సీఈఓ గణపతి, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
ముగ్గురు దొంగల అరెస్ట్
– పావు కిలో బంగారం, 665 గ్రాముల వెండి స్వాధీనం
బెల్లంపల్లి, వెలుగు: పట్టణంలో, మండలంలో ఆరు చోట్ల దొంగతనం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 251 గ్రాముల బంగారం, 665 గ్రాముల వెండి, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహజన్ మంగళవారం బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియాకు వివరాల వెల్లడించారు. పట్టణానికి చెందిన బద్రుద్దీన్, అఫ్సియా షిరిన్, సికిందర్, ఎండి యాసీన్, మురుకుట్ల కిరణ్ పలు చోట్ల దొంగతనాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డ బద్రుద్దీన్, సికిందర్, షిరిన్ ను ఎంక్వైరీ చేయగా అసలు విషయం చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. వీరంతా గంజాయి, మద్యానికి బానిసై.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఆయన చెప్పారు. దొంగలను పట్టుకున్న పోలీసులు సంపత్, ఎస్ కె. పాండె, రవి, మల్లేశ్, పి. అంజి, మహికాంత్, సంజీవ్ కు రివార్డ్ అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ ఎడ్ల మహేశ్, ఇన్ స్పెక్టర్లు ఎం. రాజు, కోట బాబురావు, ఎస్సైలు మేకల సంతోష్ ఉన్నారు.
ఆంక్షలు లేకుండా జీవన భృతి ఇవ్వాలె
భైంసా, వెలుగు : ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి ఇవ్వాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు టి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం భైంసాలో ధర్నా చేశారు. నర్సింహా కల్యాణ మండపం నుంచి బీడీ లు కార్మికులు ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ తీశారు. బీడీ పరిశ్రమను ప్రభుత్వం సంక్షోభంలో నెట్టిందని, మినీ సిగరెట్ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందన్నారు. లక్షలాది మంది బీడి కార్మికుల పని దెబ్బతినడంతో, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. చాలామంది బీడి కార్మికులు అర్హులుగా ఉన్నారని, వారికి ఇప్పటికీ పింఛన్ రావడం లేదన్నారు. అందరికీ పింఛన్లు అందే వరకు పోరాటాలు చేస్తామని తెలిపారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, కార్యదర్శి ఎం. హరిత, రాజు, వెంకటేశ్, మహేందర్, నవీన్, సాగర పాల్గొన్నారు.
అయ్యప్ప పడిపూజ పోస్టర్లు ఆవిష్కరణ
రామకృష్ణాపూర్ ,వెలుగు: సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈనెల 27న జీఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. మంగళవారం స్థానిక విజయగణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సింగరేణి మెడికల్ సూపరిటెండెంట్ డాక్టర్ రాజారమేశ్, గురుస్వామి రంగాచారి, ఆయ్యప్ప భక్తులు పోస్టర్లను ఆవిష్కరించారు. మండల పూజోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో గురుస్వాములు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
శాంతిఖని గనిలో క్విజ్ పోటీలు
బెల్లంపల్లి, వెలుగు : బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శాంతిఖని బొగ్గుగనిలో ఉద్యోగులకు, కార్మికులకు మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభకనబర్చిన జె.సాగర్, ఎస్.రాజేశ్, ఎస్. రంజిత్ కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ ఇన్ చార్జి ముస్తఫా, పిట్ ఇంజనీర్ రాంబాబు, వెంటిలేషన్ అధికారి పూర్ణ చందర్, ఇంజనీర్ రామ్ సాగర్, సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, టీబీజీకెఎస్ ఫిట్ సెక్రటరీ దాసరి శ్రీనివాస్, ఏఐటీయూసి ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ కార్మికులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తాం
పార్టీ వీడితే నష్టమేమీ లేదు
భైంసా, వెలుగు : కాంగ్రెస్ కు జిల్లాలో పూర్వవైభవం తీసుకొస్తామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. భైంసాలోని పార్టీ ఆఫీస్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డీసీసీ అధ్యక్షులుగా కొనసాగిన రామారావు పటేల్ పార్టీ వీడినా తమకు ఎలాంటి నష్టం లేదన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ సైతం పార్టీకి ద్రోహం చేసినవాళ్లే అన్నారు. త్వరలోనే డీసీసీ అధ్యక్ష పదవితో పాటు బూత్ నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలూ వేస్తామని చెప్పారు. అలాగే తాను బీజేపీలో చేరుతున్నట్టు సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు నమ్మొద్దని ఖండించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లీడర్లు ఆనంద్‌రావు పటేల్, రమణ రెడ్డి, లతీఫ్, హైమద్, ముత్యం రెడ్డి, అజారొద్దీన్ పాల్గొన్నారు.
46వసారి రక్తదానం
మంచిర్యాల, వెలుగు: క్రెడాయ్ స్టేట్ వైస్ చైర్మన్ వి.మధుసూదన్‌రెడ్డి ‘ఏబీ– నెగటివ్ ’ బ్లడ్‌ను 46వసారి దానం చేసి అత్యవసర సమయంలో ఓ బాలింతకు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలానికి చెందిన తబస్సుమ్ ఫాతిమా(25)కు గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్లో మంగళవారం డెలివరీ అయింది. ఆమెకు ఏబీ నెగటివ్ బ్లడ్ అవసరం కావడంతో మంచిర్యాలోని రెడ్‌క్రాస్ సొసైటీని ఆశ్రయించారు. మధుసూదన్‌రెడ్డి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇన్చార్జిగా కూడా వ్యవహరిస్తుండడంతో విషయం తెలుసుకున్న వెంటనే రక్తదానం చేశారు.
మెడికల్ కాలేజీ ప్రారంభం
మంచిర్యాల, వెలుగు: జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంగళవారం హైదరాబాద్ నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ భారతి హోళికేరి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కాలేజీ ప్రారంభంతో ఈ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్య చేరువైందని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ సుబ్బరాయుడు, తహసీల్దార్ రాజేశ్వర్, ఆర్అండ్బీ ఈఈ రాము, ప్రిన్సిపల్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెజారిటీ డాక్టర్లు హాజరుకాలేదు. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని, తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా అగౌరవ పరిచారని టీఆర్ఎస్ కౌన్సిలర్ అంకం నరేశ్ నిరసన తెలిపారు.
ఘనంగా తాలసప్తమి వేడుకలు ప్రారంభం
కుభీరు,వెలుగు: మండలంలోని విఠలేశ్వర ఆలయంలో మంగళవారం తాల సప్తమి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవతామూర్తులను ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలు ఏడు రోజులపాటు కొనసాగుతాయి. తాలసప్తమి వేడుకల ముగింపు సందర్భంగా పెద్ద జాతర ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
బీజేపీ ముథోల్ సెగ్మెంట్ కన్వీనర్‌గా సాయినాథ్
భైంసా, వెలుగు : ముథోల్ సెగ్మెంట్ బీజేపీ కన్వీనర్‌గా తాడేవార్ సాయినాథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. అనంతరం సాయినాథ్‌ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్‌రావు పటేల్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దశరథ్, కపిల్, దిలీప్, లీడర్లు సుభాష్ పటేల్, మనోజ్, రామకృష్ణ, సంజీవ్ పటేల్ ఉన్నారు.