విజిలెన్స్ రిపోర్ట్‎పై ఏం చేద్దాం.. 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు..?

విజిలెన్స్ రిపోర్ట్‎పై ఏం చేద్దాం.. 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు..?
  • కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు  సిఫార్సు
  • వీరిలో ఎక్కువమంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజినీర్లే!
  • ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర ప్రభావం
  • తర్జనభర్జన పడ్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • 39 మందిలో 17 మందిపై క్రిమినల్, 22 మందిపై శాఖాపరమైన చర్యలకు విజిలెన్స్​ సూచన
  • వీరిలో గత సర్కారు తప్పుల వల్ల ఇరుక్కున్నవాళ్లే ఎక్కువ
  • నేరుగా ప్రమేయం లేని వారికి రిలీఫ్​ కల్పించే యోచనలో రాష్ట ప్రభుత్వం
  • కమీషన్లకు ఆశపడి కావాలనే తప్పు చేసినవాళ్లపై మాత్రం కఠిన చర్యలు
  • విజిలెన్స్​ రిపోర్ట్​పై మరోసారి సమీక్షించనున్న సర్కార్​!

హైదరాబాద్​, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్​డిపార్ట్​మెంట్​ఇచ్చిన రిపోర్టుపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. 17 మంది సీనియర్ ఇంజనీర్లపై క్రిమినల్​చర్యలు, మరో 22 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్​సిఫార్సు చేసింది. వీరంతా ఇరిగేషన్​శాఖలో కీలకమైన ఇంజినీర్లు కావడం, ఒకేసారి చర్యలు తీసుకుంటే డిపార్ట్​మెంట్​కుప్పకూలే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఇప్పటికే సీనియర్​ స్థాయిలో అధికారుల కొరత వేధిస్తుండడంతో పెండింగ్​ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదు. ఇలాంటి టైంలో అంతమంది అధికారులపై చర్యలు తీసుకుంటే ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. 

కాగా, చర్యలకు విజిలెన్స్​సిఫార్సు చేసిన అధికారుల్లో ఎక్కువ మంది గత సర్కారు చేసిన తప్పుల వల్ల ఇరుకున్నవాళ్లే ఉన్నారు. తప్పని తెలిసినా పైనుంచి వచ్చిన ఆదేశాలను పాటించామని, ఇందుకు తమను శిక్షించవద్దంటూ కొందరు ఆఫీసర్లు ఇప్పటికే ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దీంతో మేడిగడ్డ ఘటనలో నేరుగా ప్రమేయం లేని అధికారులకు రిలీఫ్​ కల్పించే ఆలోచనలో రాష్ట్ర సర్కార్​ ఉన్నట్లు తెలుస్తున్నది. నేరుగా సంబంధం ఉన్న అధికారులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే  రిపోర్టుపై మరోసారి  విజిలెన్స్  అధికారులతో సమీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు ఇరిగేషన్​ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కాంట్రాక్టర్ల  కమీషన్ల కోసం, నాటి పెద్దల మెప్పు కోసం కావాలని తప్పులు చేసిందెవరు? తమ తప్పులేకున్నా ఇరుక్కున్నవాళ్లు ఎవరు అనేది తేల్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 

వారిలో సర్వీసులో ఉన్నది 29 మంది

2023 అక్టోబర్​లో మేడిగడ్డ బ్యారేజీ కుంగాక నేషనల్​డ్యామ్​సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ), విజిలెన్స్​విచారణకు ప్రస్తుత​ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. పలు దఫాలుగా డిపార్ట్​మెంట్​లోని రిటైర్డ్​ఈఎన్​సీలు, ఈఎన్​సీలు, సీనియర్​ఇంజనీర్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అకౌంట్స్​ఆఫీసర్లను విజిలెన్స్ డిపార్ట్​మెంట్​విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో పాటు క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్​ అండ్​ మెయింటెనెన్స్​ (ఓ అండ్​ ఎం) వ్యవహారాలు చూసిన అధికారులను పిలిచి, వారి నుంచి స్టేట్​మెంట్లను రికార్డు చేసింది. బ్యారేజీలో తొలినాళ్లలోనే సీపేజీలు ఏర్పడినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పనులు కాకముందే నిర్మాణ సంస్థకు కంప్లీషన్​ సర్టిఫికెట్లు ఇవ్వడం, బ్యాంక్​ గ్యారంటీలను రిలీజ్​ చేయడం వంటి ఘటనలపై 39 మంది అధికారులపై విజిలెన్స్​ డిపార్ట్​మెంట్​అభియోగాలు మోపింది. 

అందులో 17 మందిపై క్రిమినల్​ ప్రొసీడింగ్స్​ ప్రకారం చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.  22 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. మొత్తం 39 మందిలో నలుగురు రిటైర్డ్​ ఈఎన్​సీలు, ఇద్దరు రిటైర్డ్​ క్వాలిటీ కంట్రోల్​ సీఈలు, ముగ్గురు సీఈలు, ఒక డిప్యూటీ సీఈ, ఇద్దరు ఎస్​ఈలు, ఒక రిటైర్డ్​ ఈఈ, ఇద్దరు ఈఈలు, ఒక వర్క్స్​ అకౌంట్​ డైరెక్టర్​ ఉన్నారు. వీరితోపాటు ఒక రిటైర్డ్​ డిప్యూటీ సీఈ, ఒక రిటైర్డ్​ ఎస్​ఈ, ఒక ఎస్​ఈ, ఒక డిప్యూటీ ఎస్​ఈ, ఆరుగురు డీఈఈలు, 11 మంది ఏఈఈలు, ఒక డివిజనల్​ అకౌంట్స్​ ఆఫీసర్ ఉన్నారు.  అభియోగాలు ఎదుర్కొంటున్న 39 మందిలో ప్రస్తుతం 29 మంది సర్వీసులో ఉండగా.. మరో పది మంది రిటైర్  అయ్యారు. రిటైర్​ అయిన వారిపై పెన్షన్​ రూల్స్​ ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా విజిలెన్స్​ సూచించింది.

తప్పు చేయని అధికారుల ఆవేదన

విజిలెన్స్​ రిపోర్టులో కొందరు సీనియర్​ అధికారుల పేర్లు బయటకు రావడంతో వారు ఆవేదనకు గురవుతున్నారు. ఇన్నాళ్లూ ఎలాంటి రిమార్క్​ లేకుండా పనిచేశామని,  తాము ఎలాంటి తప్పు చేయకున్నా నాటి ప్రభుత్వ పెద్దల పుణ్యమా అని తమ కెరీర్ పై మచ్చపడిందని వాపోతున్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారుల్లో కొందరు మరికొన్ని నెలల్లో రిటైర్​ కాబోతున్నారు. ఆ ప్రాజెక్టుతో, అందులో జరిగిన అక్రమాలతో నేరుగా సంబంధమున్నవాళ్లంతా బాగానే ఉన్నారుగానీ.. తమను మాత్రం బలిపశువులను చేస్తున్నారని వాపోతున్నారు. గత ప్రభుత్వం చెప్పినట్టు.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడం తప్ప తాము ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. 

కాళేశ్వరం కమిషన్​ రిపోర్టు అందుకే ఆలస్యం

విజిలెన్స్​ నివేదికపై సర్కారు రివ్యూ చేయాలని యోచిస్తున్న నేపథ్యంలో..  కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ రిపోర్టు లేట్​ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే 110 మంది దాకా అధికారులను విచారించిన జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ నేతృత్వంలోని జ్యుడీషియల్​ కమిషన్​.. రిపోర్టుకు తుదిమెరుగులు దిద్దుతున్నది. అధికారుల స్టేట్​మెంట్లు, వారు సమర్పించిన అఫిడవిట్లు, డాక్యుమెంట్ల ఆధారంగా పలువురు రిటైర్డ్​ ఈఎన్​సీలు, సీనియర్​ ఇంజనీర్లు, ఐఏఎస్​ అధికారులపై చర్యలకు ఉపక్రమించేలా నివేదికను దాదాపు ఫైనల్​చేసింది. షెడ్యూల్​ ప్రకారం ఈ నెలాఖరుకే ప్రభుత్వానికి కమిషన్​ తన రిపోర్టును సమర్పించాల్సి ఉంది. కానీ..  ప్రభుత్వం మాత్రం విజిలెన్స్​ రిపోర్టుపై ఏదో ఒకటి తేల్చాకే కమిషన్​ రిపోర్టుపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

ఈ క్రమంలోనే కాళేశ్వరం కమిషన్​ రిపోర్ట్​ను కొన్ని రోజులపాటు హోల్డ్​లో పెట్టాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. దీంతో కమిషన్​ గడువును మరో నెల పాటు పొడిగించనున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 22న కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ మరోమారు హైదరాబాద్​కు వచ్చి విచారణకు సంబంధించిన ఫార్మాలిటీస్​ పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ప్రజాప్రతినిధులను పిలవాలా వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదన్న చర్చ జరుగుతున్నది. వీటన్నింటి నేపథ్యంలోనే ప్రభుత్వానికి కమిషన్​ నివేదిక మే లో అందుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.