
- మేడిగడ్డ కుంగిన ఘటనలో అధికారులపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు
- ప్రమోషన్ల లిస్టులో పలువురు అధికారుల పేర్లు
- విజిలెన్స్ రిపోర్టుతో ఆలోచనలో పడిన ప్రభుత్వం
- కాళేశ్వరం కమిషన్ రిపోర్టు వచ్చే వరకు వేచి చూసే యోచన
- తమ తప్పు లేకున్నా చర్యలకు సిఫార్సు చేయడంపై అధికారుల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజినీరింగ్ అధికారుల ప్రమోషన్లకు ‘విజిలెన్స్’ రిపోర్టు బ్రేకులు వేసింది. పలువురు ఎస్ఈలు, సీఈలు ప్రమోషన్ల జాబితాలో ఉండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సిఫార్సు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి వాళ్లు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.
అంచనాల సవరణ, నిర్మాణ సంస్థకు క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అక్రమాలకు పాల్పడ్డారని రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే వారి ప్రమోషన్లను ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్విచారణ పూర్తయి నివేదిక దశలో ఉన్నందున.. ఆ కమిషన్ రిపోర్టు వచ్చే వరకు ప్రమోషన్లను హోల్డ్‌లో పెట్టాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
చాలా మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ కూడా ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. దానికి అనుగుణంగానే తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ రిపోర్టును సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ రిపోర్టులో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రభుత్వం ప్రమోషన్లపై ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
కొన్ని దశాబ్దాల కల..
ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతున్నాయి. గత బీఆర్ఎస్ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వకుండా కేవలం అదనపు బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకున్నది. జోన్ 5, జోన్6 గొడవ.. కోర్టు కేసులను సాకుగా చూపి ప్రమోషన్లను ఇవ్వలేదు. దీంతో ఈఈ, ఎస్ఈ, సీఈ స్థాయిలో అదనపు బాధ్యతలు తప్ప.. పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రమోషన్లను క్లియర్ చేసేందుకు నిర్ణయించింది. కోర్టు కేసులు త్వరగా పూర్తయ్యేలా చూసింది. ప్రమోషన్ల జాబితాను సిద్ధం చేసేందుకు జనవరిలో ఫైవ్‌మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. రెండుసార్లు డీపీసీ నిర్వహించింది. తొలిదశలో భాగంగా ఎస్ఈ నుంచి సీఈలు, సీఈ నుంచి ఈఎన్సీలుగా ప్రమోషన్లను ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది.
ఆ లిస్ట్ సిద్ధం చేసింది. ఈ నెలాఖరు నాటికి వారికి ప్రమోషన్లు ఇచ్చేయాలనుకున్నప్పటికీ.. విజిలెన్స్ రిపోర్టుతో దానికి బ్రేకులు పడినట్టయింది. వీళ్ల ప్రమోషన్లు పూర్తయితేగానీ.. ఏఈఈ నుంచి డీఈఈ, డీఈఈ నుంచి ఈఈ, ఈఈ నుంచి ఎస్ఈ ప్రమోషన్లకు మోక్షం కలిగే మార్గం కనిపించట్లేదు.
అధికారుల ఆవేదన..
క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ రిపోర్టులో పేర్కొనడంపై కొందరు అధికారులు ఆవేదనకు గురవుతున్నారు. తాము ఏ తప్పూ చేయకపోయినప్పటికీ ఇలాంటి సిఫార్సులు చేయడంపై నిరాశకు లోనవుతున్నారు. కొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న అధికారులకు ఆ రిపోర్ట్ శరాఘాతంగా మారింది.
సర్వీస్ మొత్తంలో ఎలాంటి రిమార్కులు లేకుండా పనిచేసిన తమకు.. ఇప్పుడు ఏ తప్పూ చేయకపోయినా చర్యలకు సిఫార్సు చేయడంపై ఆవేదనతో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసినందుకు గుర్తింపు రాకపోగా.. ఇప్పుడు ఓ రిమార్క్‌ను అంటగడుతున్నారని వాపోతున్నారు. ఆనాడు ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు చెప్పినట్టు చేసిన దానికి తాము బలిపశువులం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.