హనుమకొండ, వెలుగు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఎవరైనా ఆన్ లైన్ మోసాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ స్టేషన్ లో, 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. మంగళవారం వరంగల్ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ను సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఓటీపీలు, లింక్‌లు, ఇతర ఆన్ లైన్ మోసాలకు గురైన బాధితులు కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు.
అనంతరం పోలీస్‌సిబ్బందికి సీపీ సెల్‌ఫోన్, సిమ్‌కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డీసీపీలు రవీందర్, అబ్దుల్‌బారీ, ట్రైనీ ఐపీఎస్‌అధికారులు అంకిత్, శుభంనాగ్, అడిషనల్ డీసీపీలు రవి, సంజీవ్, సురేశ్ కుమార్, సైబర్‌క్రైమ్స్ పోలీస్‌స్టేషన్ ఏసీపీ విజయ్‌కుమార్, సీఐ రవి కుమార్ పాల్గొన్నారు.