మిషన్ భగీరథపై విజిలెన్స్.. సెకండరీ, ఇంట్రా పైప్​లైన్​నెట్ వర్క్​లో భారీ అక్రమాలు

మిషన్ భగీరథపై  విజిలెన్స్.. సెకండరీ, ఇంట్రా పైప్​లైన్​నెట్ వర్క్​లో భారీ అక్రమాలు
  • రూ.7 వేల కోట్లు పక్కదారి పట్టినట్టు అనుమానం
  • గ్రామాల వారీగా అక్రమాలు నిగ్గుతేల్చాలని సీఎం ఆదేశం
  • ఫీల్డ్​లోకి దిగిన విజిలెన్స్​ డిపార్ట్​మెంట్

హైదరాబాద్, వెలుగు: మిషన్​భగీరథలో అక్రమాలను నిగ్గుతేల్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది. ఇంట్రా పైప్​లైన్ ​నెట్​వర్క్​పేరుతో భారీ ఎత్తున ప్రజాధనం దోపిడీ చేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తున్నది. రూ.7 వేల కోట్ల వరకు కాంట్రాక్టర్లు, గులాబీ లీడర్లు మింగేసినట్టు గుర్తించినట్లుగా సమాచారం. భగీరథ సెకండరీ, ఇంట్రా పైప్​లైన్​ నెట్​వర్క్​సహా ఇతర పనుల్లో అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని విజిలెన్స్​ అండ్​ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. 

సీఎం ఆదేశాలతో విజిలెన్స్​అధికారులు ఫీల్డ్​లోకి దిగారని సమాచారం. రాష్ట్రంలోని ఒక్కో మండలంలోని ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మిషన్ భగీరథలో అసలేం జరిగిందో తేల్చాలని సీఎం ఆదేశించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఆర్​డబ్ల్యూఎస్​లో భాగంగా వేసిన పైపులైన్లను మాత్రమే భగీరథ నీటి సరఫరాకు వాడుతున్నా కొత్తగా పైప్​లైన్​లు వేశామని ఎంబీలు రికార్డు చేశారు. కొత్తగా నల్లాలు బిగించామని, పైపులైన్లు వేశామని చెప్తూ భారీ ఎత్తున ప్రజాధనం మింగేశారు. అసలు పైపులు, ట్యాప్​లు, ఇతర సామాన్లు కొనుగోలు చేయకుండానే కొన్నట్టుగా నకిలీ బిల్లులు సృష్టించి ఒక్కో ఊరిలో లక్షలాది రూపాయలు నేతలు, కాంట్రాక్టర్లు జేబులో వేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. కొన్ని చోట్ల మెటీరియల్​కొనుగోలు చేసినా వాటిని ఉపయోగించలేదని తెలుస్తున్నది. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్​అధికారులు విచారణ షురూ చేసినట్టు తెలుస్తున్నది.

మిషన్​భగీరథ ప్రాజెక్టును రూ.43,791 కోట్లతో చేపట్టగా రూ.31 వేల కోట్లు ఖర్చు చేశారు. ట్రంక్, సెకండరీ పైపులైన్​ల పేరుతో సుమారు లక్ష కి.మీ.ల పొడవైన పైప్ లైన్లు వేశారు. అప్పటికే ఆర్​డబ్ల్యూఎస్​లో ఉన్న 45 వేల కి.మీ.ల పొడవైన పైప్​లైన్​ను అడాప్ట్​చేసుకున్నారు. సెకండరీ, ఇంట్రా పైప్​లైన్ల పేరుతో అక్రమాలు చేసినట్టు ప్రభుత్వం అనుమానిస్తున్నది. ఓవర్​ హెడ్​ బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్ల నుంచి గ్రామాల్లోని ఓవర్​ హెడ్​ ట్యాంకులకు సెకండరీ పైపులైన్ల ద్వారా నీటిని తరలిస్తారు. ఓవర్​హెడ్​ట్యాంకుల నుంచి ఇంట్రా పైప్​లైన్ వర్క్​కు నీటిని సప్లయ్​చేస్తారు. ఈ రెండు పనులతో పాటు వీటికి సంబంధించిన సామాన్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు సందేహిస్తున్నారు.

ఈ స్కీంలో భాగంగా ఖర్చు చేసిన రూ.31 వేల కోట్లలో రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పక్కదారి పట్టినట్టు అనుమానిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా నిర్మించిన డబుల్​బెడ్రూం కాలనీలు, ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లకు కొత్తగా పైపులైన్లు వేసినట్టుగా రికార్డుల్లో చూపించారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లలో కొన్ని ఇంట్రా పైపులైన్​లు వేసినా వాటిని వినియోగించడం లేదని, పాత ఆర్​డబ్ల్యూఎస్​పైపులైన్లకే నీటిని సరఫరా చేస్తున్నారని ఫీల్డ్​విజిట్​లో తేలినట్టుగా సమాచారం. భగీరథ పేరుతో కొన్ని చోట్ల నల్లాలు ఏర్పాటు చేసినా వాటికి చుక్క నీటిని సరఫరా చేయడం లేదు. గ్రామాలకు బల్క్​గా సరఫరా చేస్తున్న నీళ్లను పాత పంపులకే సప్లయ్ చేస్తున్నారు. దీంతో కొత్త ఇంట్రా పైపులైన్లతో పాటు నల్లాలు కూడా వృథాగా మారాయి. ఇలా వృథాగా మారిన వ్యయంతో పాటు ఎక్కడెక్కడ ఎలా నిధుల దోపిడీ జరిగిందో విజిలెన్స్ తేల్చనుంది.

ALSO READ: నల్గొండ ఎంపీ సీట్లపై వారసుల గురి!