- ఏఎంఓహెచ్లపై కొనసాగుతున్న ఎంక్వైరీ
- త్వరలో పలువురిపై వేటు?
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లకు విజిలెన్స్ భయం పట్టుకుంది. కొందరు ఏఎంఓహెచ్(అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్)లు కొన్నేండ్లుగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్ అండ్ఎన్ఫోర్స్మెంట్ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఏఎంఓహెచ్‌లకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవలే చార్మినార్ జోనల్ ఆఫీసులోని రికార్డులు తనిఖీ చేశారు. బల్దియా హెడ్డాఫీసు నుంచి కొంత మంది డేటా తీసుకున్నారు. పలువురు మెడికల్ ఆఫీసర్లు ఎస్ఎఫ్ఏ(శానిటరీ ఫీల్డ్అసిస్టెంట్)ల నుంచి మామూళ్లు తీసుకుంటున్న ఫొటోలు సేకరించినట్లు తెలిసింది. ప్రధానంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసేందుకు ఒకరిద్దరు మెడికల్ ఆఫీసర్లు భారీగా అవినీతికి పాల్పడినట్లు సమాచారం. ఓ మహిళా మెడికల్ ఆఫీసర్ పైసలు తీసుకుని ఒకే వ్యక్తికి 4 డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిసింది. 15 – 20 రోజుల్లో మరింత సమాచారం సేకరించి కరెప్టెడ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోనున్నారు. ఎంక్వైరీ ఫేస్చేస్తున్న వారిలో ఆరుగురు ప్రస్తుతం బల్దియాలో పని చేస్తుండగా, మిగిలినవారు తిరిగి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్లిపోయినట్లు తెలిసింది.
డిప్యూటేషన్‌పై వచ్చి..
జీహెచ్ఎంసీలో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి డిప్యూటేషన్‌పై వస్తున్నారు. ఒక్కసారి బల్దియాకు వచ్చిన ఆఫీసర్ తిరిగి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రూల్ ప్రకారం
డిప్యూటేషన్‌పై వచ్చినవారు మూడేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైతే మరో రెండేళ్లు పనిచేసి తిరిగి పేరెంట్ డిపార్ట్మెంట్కు వెళ్లిపోవాలి. కానీ ఆఫీసర్లు తమకు ఆ రూల్ వర్తించదన్నట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమ సంపాదనకు ఎక్కువ చాన్స్ఉండడంతోనే వెళ్లడం లేదని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణలో తెలుస్తోంది. ఏ పనిచేయాలన్నా మెడికల్ ఆఫీసర్లు పైసలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగుల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పలువురు నేరుగా కమిషనర్‌కే ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ పరి
ధిలో 30 సర్కిల్స్ ఉండగా ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్లు 23 మంది మాత్రమే ఉన్నారు. ఐదేళ్లకు మించి పనిచేస్తున్న ఆఫీసర్లపైనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
వీళ్లు మాకొద్దు
కొంతమంది మెడికల్ ఆఫీసర్లపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తుండటంతో ‘ఈ ఆఫీసర్ మాకొద్దంటూ’ పలువురు జోనల్ కమిషనర్లు ఏకంగా ఓ అడిషనల్ కమిషనర్ని వేడుకుంటున్నట్లు సమాచారం. వారితో తమకు కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని, వేరే చోటికి ట్రాన్స్ ఫర్ చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. బల్దియాలోని మెడికల్ ఆఫీసర్లపై అదే డిపార్టమెంట్ ఉన్నతాధికారులు కంప్లయింట్స్ చేస్తున్నారంటే ఏఎంఓహెచ్‌ల పనితీరు ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. విజిలెన్స్ ఆఫీసర్లు పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కింది స్థాయి ఉద్యోగులు కోరుతున్నారు.