GT vs MI: పొగిడి పక్కనపెట్టారు: ముంబై జట్టులో యువ సంచలనానికి నో ఛాన్స్

GT vs MI: పొగిడి పక్కనపెట్టారు: ముంబై జట్టులో యువ సంచలనానికి నో ఛాన్స్

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో యువ సంచలనాన్ని పక్కన పెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో సత్తా చాటిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ లేకుండా తుది జట్టును ప్రకటించింది. టాస్ తర్వాత ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం షాకింగ్ కు గురి చేసింది. బాగా బౌలింగ్ వేసిన అతన్ని ఒక్క మ్యాచ్ కే పరిమితం చేయడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. 

చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విగ్నేష్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్ బౌలర్లు విఫలమైన చోట చక్కగా  రాణించాడు. గైక్వాడ్, దూబే, దీపక్ హుడాలాంటి కీలక వికెట్లు తీసుకొని మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశాడు. ఈ 24 ఏళ్ళ కుర్రాడిపై సర్వత్రా ప్రశసంలు కురిపించారు. ధోనీతో పాటు ముంబై యాజమాని నీతా అంబానీ ఈ కుర్రాడి ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు. ఈ టోర్నీలో సంచలనంగా మారడం ఖాయమను కున్న దశలో ప్లేయింగ్ 11 నుంచి తప్పించడం విచారకరం.

విగ్నేష్ లేకపోవడంతో ముంబై స్పిన్ బాధ్యతలను ముజీబ్, సాంట్నర్ పంచుకున్నారు. సాంట్నర్ పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెండు ఓవర్లలోనే 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ సమిష్టిగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63 పరుగులు: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గిల్(38), బట్లర్ (39) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య 2 వికెట్లు తీసుకున్నాడు. బోల్ట్, చాహర్, ముజీబ్, సత్యనారాయణ తలో వికెట్ పడగొట్టారు.