- ఊపందుకున్న సాగు పనులు
- ఉమ్మడి మెదక్ జిల్లాలో ముమ్మరంగా వరినాట్లు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆందోళనలో ఉన్న రైతులకు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. బోర్ల కింద సాగు చేసిన వరి, పత్తి పంటలకు మేలు కలుగుతుండగా దుక్కులు దున్ని, నారుమడులు పెంచుకున్న రైతులు వరినాట్లు వేస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షం పడకున్నా అన్ని మండలాల్లో ఎడతెరిపి లేకుండా ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. వానాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 249.9 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 220.7 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. చెరువు, కుంటల్లోకి నీరు చేరనప్పటికీ పత్తి పంటకు, బోర్ల కింద సాగు చేసిన వరి పంటకు మేలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు.
అంతేగాక వర్షాభావ పరిస్థితులతో ఎండుముఖం పడుతున్న వరి నారుకు ఈ వానలు ఊపిరిపోశాయి. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో అన్ని రకాల పంటలు కలిపి 3.73 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారనేది అంచనా కాగా ఇప్పటి వరకు 60 వేల ఎకరాల వరకు సాగయ్యాయి. ప్రస్తుతం ఓ మోస్తరు వానలు కురుస్తుండడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో ముందు ముందు వరి నాట్లు మరింత ఊపందుకోనున్నాయి.
సిద్దిపేట జిల్లాలో..
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సీజన్ లో సరైన వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలకు ముసురు వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జూలై లో ఇప్పటి వరకు 216.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం 5.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా అక్కన్నపేటలో 12, ములుగులో 9.8, మర్కుక్, వర్గల్ మండలాల్లో 9.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా కొమురవెల్లి మండలంలో 1.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
జిల్లాలోని 26 మండలాల్లో సిద్దిపేట అర్బన్, దౌల్తాబాద్, ములుగు, చేర్యాల మండలాల్లో జూలై లో తక్కువగా వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సీజన్ లో పత్తి విత్తిన రైతుల్లో ముసురు వర్షాలు ఆశలను సజీవంగా ఉంచితే వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాలో 5.70 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యానికి ఇప్పటివరకు 1,80 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి సాగు 3.7 లక్షల సాగు జరుగుతుందని అంచనా వేయగా ఇప్పటి 39 వేలు, లక్ష ఎకరాల్లో పత్తి , మొక్కజొన్న 20 వేలు, నాలుగు వేల ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. ముసురు వర్షాలతో రానున్న రోజుల్లో వరి నాట్లు మరింత ముమ్మరంగా సాగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో ముసురు వానలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానకాలం సీజన్ లో పంటల సాగుకు సరైన వర్షాలు లేక రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు పోసి నారుమళ్లు కాపాడుకున్నారు. కాగా రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానలతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 19వరకు 211.6 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కాగా, శనివారం 5.3 మిల్లీమీటర్ల వర్షం పడింది.
అత్యధికంగా గుమ్మడిదల 17.3, జిన్నారం 13.5, ఆందోల్ 12. 8, చౌటకూర్ మండలంలో 11.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 7,24,405 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేయగా, ఎక్కువగా పత్తి పంట 3.60 లక్షల ఎకరాలు, వరి 1.50 లక్షల ఎకరాలు, సోయాబీన్ 77,600 ఎకరాలు, కంది 79,500 ఎకరాలు, మొక్కజొన్న 14,200 ఎకరాలు, మినుములు 6,300 ఎకరాలు, పెసర్లు 9,800 ఎకరాలు, చెరుకు 25,000 ఎకరాల్లో సాగుకు రైతులు సిద్ధమయ్యారు.
సింగూరు ఆశలు నెరవేరేనా?
సంగారెడ్డి, మెదక్ జిల్లా వాసులకు వరప్రదాయిని సింగూరు ప్రాజెక్టు. సాగు నీటి సరఫరాపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానలతో ఉపశమనం పొందిన రైతాంగం సింగూరు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందితే మరింత మేలు జరుగుతుందనే ఆశలో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు వద్ద నిర్మించిన ఈ ప్రాజెక్టు 29.917 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 13.596 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. సంగారెడ్డి జిల్లాలో 40వేల ఎకరాలు, మెదక్ జిల్లా వనదుర్గ ప్రాజెక్ట్ కింద 21,625 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది.
అయితే ఇప్పటికే కాల్వల ద్వారా నీళ్లు విడుదల చేయాల్సి ఉండగా ప్రాజెక్టులో నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల ఇప్పటివరకు ఆయా ఎకరాలకు నీరు అందించలేకపోయారు. ప్రాజెక్టులో 16 టీఎంసీల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నప్పుడే సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. అందుకే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడి సింగూరు ప్రాజెక్టు నిండాలని రైతులు కోరుకుంటున్నారు.