- మహబూబాబాద్ జిల్లాలో జోరుగా నాటుసారా తయారీ
- టన్నుల కొద్దీ పట్టుబడుతున్న నల్లబెల్లం, పటిక
- ఏడు నెలల్లో 1,140 మందిపై కేసు, ఏడుగురిపై పీడీ యాక్ట్
- గ్రామాల్లో కనిపించని పునరావాస యూనిట్లు
మహబూబాబాద్, వెలుగు : ‘మహబూబాబాద్ గుడుంబా రహిత జిల్లా’ అని రెండేళ్ల కింద ఆఫీసర్లు ప్రకటించారు. ఆ మాటలు కేవలం ప్రకటనకే పరిమితం కాగా, జిల్లాలోని పలు గ్రామాలు, తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొందరు వ్యక్తులు ఏపీ నుంచి నల్లబెల్లం, పటిక తీసుకొస్తూ యథేచ్ఛగా నాటుసారా కాస్తున్నారు. అక్కడక్కడా ఆఫీసర్లు చేస్తున్న తనిఖీల్లో టన్నుల కొద్దీ నల్లబెల్లం, పటిక పట్టుబడుతోంది.
కనిపించని 274 పునరావాస యూనిట్లు
మహబూబాబాద్ జిల్లాలో 2014 కంటే ముందు నాటుసారా తయారీ విస్తృతంగా జరిగేది. దీంతో ఈ పని మాన్పించాలన్న ఉద్దేశంతో పునరావాస యూనిట్లు మంజూరు చేశారు. ఇందులో భాగంగా నాటుసారా తయారీ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి డీఆర్డీఏ ద్వారా రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఈ డబ్బులతో గొర్రెలు, గేదెలు, ఆటోలు కొనివ్వడం, కిరాణ షాపు పెట్టుకొని స్వయం ఉపాధి పొందేలా ఏర్పాట్లు చేశారు.
ఇలా మహబూబాబాద్ జిల్లాలో 274 మందికి యూనిట్లు అందజేశారు. తర్వాత ఎక్సైజ్ ఆఫీసర్లు మూడేళ్ల పాటు మానిటరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు తమకు మంజూరైన యూనిట్లను అమ్మేసుకున్నారు. తర్వాత మళ్లీ నాటుసారా తయారీ బాట పట్టినట్లు తెలుస్తోంది.
టన్నుల కొద్దీ పట్టుబడుతున్న నల్లబెల్లం
నాటుసారా తయారీ, విక్రయానికి సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు జిల్లాలోని మహబూబాబాద్, గూడూరు, తొర్రూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 1,140 మందిపై కేసు నమోదు చేశారు, అలాగే 7,649 లీటర్ల గుడుంబా సీజ్ చేయడంతో పాటు 1,15,450 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 120 బైక్‌లు, 1,77,287 కిలోల నల్లబెల్లం, 12,008 కిలో పటికను సీజ్ చేశారు. అదే విధంగా ఏడుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు.
గుడుంబా నియంత్రణకు చర్యలు
జిల్లాలో గుడుంబా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. నల్లబెల్లం, నాటుసారా అమ్ముతూ పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను యువకులు వివరించాలి. ఎక్కడైనా నాటుసారా తయారీ, అమ్మకాలు జరిగితే సమాచారం ఇవ్వాలి.
– కిరణ్ నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, మహబూబాబాద్