కొత్తగూడెంలో గడల రాజకీయం

  • గులాబీ పాంప్లెంట్లపై టూర్​ షెడ్యూళ్లు
  • సేవాకార్యక్రమాలు, పరామర్శలతో హల్​చల్​
  • నియోజకవర్గంలో జోరుగా రాజకీయ ప్రచారం
  • సీఎస్ కు ఫిర్యాదులు.. విమర్శలు వస్తున్నా మారని తీరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖలో 'డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​'గా పనిచేస్తున్న గడల శ్రీనివాసరావు వేషం, భాష మార్చి పొలిటీషియన్​ అవతారం ఎత్తారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరుపున కొత్తగూడెం టికెట్​ఆశిస్తున్న ఆయన, ఇటీవల రాజకీయ కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారు. సేవా కార్యక్రమాలు, పరామర్శల పేరుతో తరుచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ హల్​చల్​ చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగూడెంలో జనహిత పేరుతో ఆఫీస్​ ఏర్పాటు చేసిన శ్రీనివాస్​రావు, ఇటీవల పాల్వంచలో మరో క్యాంప్​ ఆఫీస్​ ప్రారంభించి, ముమ్మర​ప్రచారం చేస్తున్నారు. కీలకమైన ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారిగా ఉండి, రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్న ఆయనపై చీఫ్​ సెక్రటరీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, సొంత శాఖ ఉద్యోగుల నుంచే విమర్శలు వస్తున్నా గడల మాత్రం డోంట్​కేర్​ అంటున్నారు. తనకు కేసీఆర్​, కేటీఆర్​మద్దతు ఉందంటూ మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.

గులాబీ పాంప్లెంట్లపై టూర్​  షెడ్యూల్స్​..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సెగ్మెంట్​పై కన్నేసిన డీహెచ్​ గడల శ్రీనివాసరావు ఇటీవల తరుచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కొంతకాలంగా కొత్తగూడెంలో ‘డాక్టర్​ జీఎస్సార్​ ట్రస్ట్’ ద్వారా  సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల జనహిత పేరుతో ఆఫీసులు తెరిచి, వాటి కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు  సాగిస్తున్నారు. బీఆర్​ఎస్ తరుపున ఈసారి కొత్తగూడెం నుంచి పోటీ చేయబోతున్నానని, కేసీఆర్​, కేటీఆర్​మద్దతు  తనకే ఉందని ఆ పార్టీ లీడర్లతో చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పర్యటనకు ఒకటి, రెండు రోజుల  ముందే తన టూర్​ షెడ్యూల్​తో పాంప్లెంట్స్​ రిలీజ్​ చేస్తున్నారు.  వాటి ద్వారా సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.  

పరామర్శలు,  విగ్రహ ప్రతిష్ఠాపనలు, వివాహ వేడుకలు, ఆఫీసుల ఓపెనింగ్​లు, టెంపుల్స్​లో పూజలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు.. ఇలా ఆయన షెడ్యూల్​లో ఒక్కో రోజు పదికి పైగా కార్యక్రమాలు ఉంటున్నాయంటే గడల రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీనివాసరావు టూర్ ​షెడ్యూల్​ కోసం తయారు చేయిస్తున్న పాంప్లెంట్లు ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిని మించి, అది కూడా ​బీఆర్ఎస్​ జెండా కలర్​ గులాబీ రంగులో ఉంటుండడం విశేషం.    

జనహిత వేదికగా పొలిటికల్​ కార్యకలాపాలు.. 

డాక్టర్​​ జీఎస్సార్​ ట్రస్ట్ ద్వారా నిన్న మొన్నటి వరకు కేవలం హెల్త్​ క్యాంప్​లు, జాబ్​ మేళాలకే పరిమితమైన డీహెచ్.. తాజాగా జనహిత పేరుతో ఏర్పాటుచేస్తున్న ఆఫీసులను తన రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే శ్రీనగర్​లో జనహిత ఆఫీసు తెరిచిన గడల, ఇటీవల పాల్వంచలలో పూర్తిస్థాయి జనహిత ఆఫీస్​ ఓపెన్​ చేశారు. అక్కడే నేతలతో సంప్రదింపులు జరుపుతూ, రాబోయే ఎన్నికల కోసం వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. స్పెషల్​గా పీఆర్​ఓలను ఏర్పాటు చేసుకొని తన కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ప్రెస్​నోట్లు రిలీజ్ ​చేస్తున్నారు. మేడే సందర్భంగా ట్రస్ట్​ఆధ్వర్యంలో పలు కార్మిక సంఘాల నేతలు, కార్మికులను సన్మానించిన గడల..ఖాకీ చొక్కా, ఎర్ర కండూవా కప్పుకొని ర్యాలీలో పాల్గొన్నారు. క్రిస్​మస్​ టైంలో  చర్చీలకు వెళ్లి ప్రేయర్​ చేసిన ఆయన,  రంజాన్ టైంలో ఇఫ్తార్​ ఇచ్చి, నమాజ్​ చేశారు.

ఈ సందర్భంగా తాను చిన్నతనంలో రోగం బారిన పడ్తే దర్గా దగ్గర కట్టించిన తావీజ్​మహిమ వల్లే బతికిబట్టకట్టానని కామెంట్​ కూడా చేశారు. దీనిపై విమర్శలు రావడంతో తన మాటలు వక్రీకరించారని వివరణ ఇచ్చారు. హెల్త్​ డైరెక్టర్​ హోదాలో ఉండి రాజకీయాలు చేస్తున్న గడలపై ఇప్పటికే సీఎస్​కు పలువురు కంప్లయింట్​ చేశారు. ఆయన తీరుపై ఉద్యోగ సంఘాల నేతలు కూడా మండిపడ్తున్నారు. ఉన్నతాధికారిగా ఉండి,  రాజకీయాలు చేయడమేంటని, పాలిటిక్స్​ చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. కానీ, ఎవరేమన్నా గడల లెక్కచేయట్లేదు. టికెట్​పై సీఎం కేసీఆర్​, కేటీఆర్​ నుంచి పక్కా హామీ ఉన్నందునే ఇంత దూకుడుగా వెళ్తున్నారని, అందువల్లే బార్డర్​ దాటుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.