కలలు అందరూ కంటారు. కానీ కన్న ప్రతి కలనూ నెరవేర్చుకోవడం కొందరికే సాధ్యపడుతుంది. ఆ విషయంలో విజయ్ దేవరకొండని మెచ్చుకోవాలి. యాక్టింగ్, ప్రొడక్షన్, బిజినెస్, సోషల్ సర్వీస్.. ఏది చేయాలనుకున్నా వెంటనే చేసేస్తాడు. అది కూడా సక్సెస్‌ఫుల్ గా. ఇప్పుడు డిజిటల్ రంగంలో కూడా తనదైన శైలిలో సాగి పోవడానికి సిద్ధపడుతున్నాడని ఇండస్ట్రీ టాక్. కరోనా థియేటర్లను దూరం చేయడంతో స్టార్స్ నుంచి ఫిల్మ్ మేకర్స్ వరకు అందరూ వెబ్ సిరీసులపైనే దృష్టి పెడుతున్నారు. విజయ్ దేవరకొండ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆహా’ అనే ఓటీటీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విజయ్ ఇప్పుడు వెబ్ సిరీసుల నిర్మాణంలోకి దిగుతున్నాడట. ఇప్పటికే కింగ్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ పెట్టి తరుణ్ భాస్కర్‌ని హీరోగా పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ తీశాడు. ఇప్పుడు తన బ్యానర్‌పై రెండు వెబ్ సిరీసుల్ని ప్లాన్ చేస్తున్నాడట. వాటిలో ఒక ప్రాజెక్టు ని కేవీఆర్ మహేంద్రకి అప్పజెప్పినట్టు వార్తలొస్తున్నాయి. మహేంద్ర గతంలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘దొరసాని’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక రెండో ప్రాజెక్ట్‌ను సందీప్ వంగతో కలిసి విజయ్ ప్రొడ్యూస్ చేస్తాడట. ఆనంద్ దేవరకొండ నటిస్తాడట. ‘అర్జున్‌రెడ్డి’తో వీళ్లిద్దరూ ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. అందుకే తమ కాంబోకి క్రేజ్ ఉంటుందనే నమ్మకంతో ఇలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇంతవరకు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి గా వార్తల్లోకి వచ్చాయి. నిజమా కాదా అనేది మాత్రం దేవరకొండే చెప్పాలి.