
Vijay Devarakonda: బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినందుకు టాలీవుడ్ స్టార్ హీరో రౌడీ విజయ్ దేవరకొండపై హైదరాబాద్ పోలీసులు పలు సంబంధిత సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే విజయ్ దేవరకొండతోపాటూ టాలీవుడ్ కి చెందిన మరో 30మందికి పైగా కేసు నమోదు చేసి ఎంక్వయరీ చేస్తున్నారు.
ఇందులో బాహుబలి మూవీ ఫేమ్ హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి, నటి మంచు లక్ష్మి, వర్సిటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్, యాంకర్ విష్ణు ప్రియ, రీతీ చౌదరి, సుప్రీత, టేస్టీ తేజ తదితరులు ఉన్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే హీరో విజయ్ దేవరకొండ గతంలో A23 అనే యాప్ ని ప్రమోట్ చేశాడు.
దీంతో విజయ్ పీఆర్ (పబ్లిక్ రిలేషన్) టీమ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. "స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది. ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు.
ALSO READ | నిమిషానికి 90 వేల రూపాయలా విష్ణుప్రియా: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఛార్జ్ అంట..!
విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది.
ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదని స్పష్టం చేసింది.
ఈ విషయం ఇలా ఉండగా ఇదే ఏ23 యాప్ ని బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, లేడీ క్రికెటర్ స్మృతి మందాన, తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తదితరులతోపాటూ మరింతమంది హిందీ నటీనటులు ప్రమోట్ చేశారు. కానీ ఇందులో కేవలం హీరో విజయ్ దేవరకొండ మీద మాత్రమే కేసు నమోదైంది..