స్వర్ణోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది : విజయ్ దేవరకొండ

స్వర్ణోత్సవాలకు రావడం ఆనందంగా ఉంది : విజయ్  దేవరకొండ

కొల్లాపూర్, వెలుగు: అమ్మ చదువుకున్న ఆర్ఐడీ స్కూల్​ స్వర్ణోత్సవాలకు రావడం ఆనందంగా ఉందని హీరో విజయ్  దేవరకొండ పేర్కొన్నారు. తన తాతయ్య ఇక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో అమ్మ, మేనమామ ఇదే పాఠశాలలో ఒక ఏడాది చదివారని గుర్తు చేసుకున్నారు. కొల్లాపూర్  ఆర్ఐడీ గోల్డెన్  జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, మై హోమ్  గ్రూప్స్  చైర్మన్  జూపల్లి రామేశ్వరావుతో కలిసి హాజరయ్యారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న స్కూల్ ను పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.

తరగతి గదులను పరిశీలించి, టీచర్లతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది పంటలు చేతికి రాగానే సింగోటం లక్ష్మీనరసింహస్వామికి మొక్కులు చెల్లించే జ్ఞాపకాలు గుర్తుకొన్నాయని తెలిపారు. ఇకనుంచి ఏడాదికి ఒకసారి కొల్లాపూర్ కు వచ్చి, మూడు రోజులు ఉంటానని చెప్పారు. ఒకే స్కూల్  నుంచి 14 మంది వీసీలుగా, పారిశ్రామికవేత్తగా, రాజకీయ నాయకులుగా ఎదగడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో తిరుపాలు, వెంకట్ దాస్ రచించి పాడిన పాటల సీడీ, విజన్ 2030,2040,2050 డాక్యుమెంటరీని ఆవిష్కరించారు. 

అనంతరం వండర్  వరల్డ్  ఆఫ్  రికార్డ్  ప్రతినిధి బృందం ధ్రువీకరణ పత్రం, ఫీల్డ్ ను కమిటీ నిర్వాహకులకు అందజేసింది. యశోద హాస్పిటల్స్  గ్రూప్  ఎండీ సురేందర్ రావు, ఢిల్లీ బిట్స్  వీసీ రాంగోపాల్ రావు, ప్రొఫెసర్  జయరాం రెడ్డి తదితరులు మాట్లాడారు. కవి అందెశ్రీ, ఉత్సవ కమిటీ చైర్మన్  కటికనేని సాయి ప్రసాద్ రావు, అక్కల అశోక్ కుమార్, రచయిత మధుసూదన శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు 

అలరించాయి.