పహల్గాంలోనే నా బర్త్ డే చేసుకున్నా.. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలి: హీరో విజయ్ దేవరకొండ

పహల్గాంలోనే నా బర్త్ డే చేసుకున్నా.. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలి: హీరో విజయ్ దేవరకొండ

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో (ఏప్రిల్ 22న) జరిగిన ఉగ్రదాడిని సినీ సెలబ్రిటీలు ఖండించారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రాణాలు కోల్పోయిన అమాయక కుటుంబాలకు మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో హీరో విజయ్ దేవరకొండ Xలో పోస్ట్ పెట్టాడు. "రెండేళ్ల క్రితమే పహల్గామ్‌లో ఓ సినిమా షూటింగ్ సందర్భంగా నా పుట్టినరోజును అక్కడే సెలబ్రేట్‌ చేసుకున్నాను. కశ్మీర్‌లోని అందమైన ప్రాంతంలో అక్కడి స్థానిక ప్రజల స్వచ్ఛమైన నవ్వుల మధ్య నా పుట్టినరోజు జరుపుకున్నాను. కశ్మీరీ స్నేహితులు నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.

నిన్న (ఏప్రిల్ 22న) ఆ ప్రాంతంలో జరిగినది విని నా హృదయం చలించిపోయింది. ఎంతో కోపాన్ని తెప్పించింది. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులు జరపడం అత్యంత సిగ్గుచేటు, మరియు పిరికిపంద చర్య. ఇలాంటి పిరికి వాళ్లను త్వరలోనే అంతమొందిస్తారని ఆశిస్తున్నా. బాధితులకు మరియు వారి కుటుంబాలకు మేము అండగా నిలుస్తాం. భారతదేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి తలవంచదని" విజయ్‌ దేవరకొండ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఈ ఘటనపై చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార, కమల్ హాసన్, మోహన్ లాల్, సంజయ్ దత్ తదితర సెలబ్రిటీలు స్పందించారు. ఈ టెర్రరిస్ట్ అటాక్ క్షమించరాని క్రూరమైన చర్య అని మెగాస్టార్ చిరంజీవి బాధపడ్డారు.

అల్లు అర్జున్ Xలో స్పందిస్తూ.. "పహల్గామ్ దాడితో హృదయం విరిగిపోయింది. దయగల వ్యక్తులతో కూడిన అందమైన ప్రదేశం ఇది. అలాంటి చోట ఈ ఉగ్రదాడి జరగడం నన్ను బాధిస్తుంది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. వారి అమాయక ఆత్మలు శాంతించాలి. నిజంగా హృదయ విదారకంగా ఉంది" అని అల్లు అర్జున్ ఎమోషన్ అయ్యాడు.

"ఒక చీకటి రోజు... పహల్గామ్‌లో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు మరియు ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి" అని మహేష్ బాబు పోస్ట్ చేశారు.