Vijay Kedia: విజయ్ కేడియా హెచ్చరిక.. డబ్బులు ముంచే స్టాక్స్ గుర్తించే టెక్నిక్స్ వెల్లడి..

Vijay Kedia: విజయ్ కేడియా హెచ్చరిక.. డబ్బులు ముంచే స్టాక్స్ గుర్తించే టెక్నిక్స్ వెల్లడి..

Gensol Stock News: గడచిన రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్టర్లకు నిద్రలేకుండా చేస్తున్న స్టాక్ జెన్సోల్. కేవలం 6 నెలల కాలంలో 85 శాతం క్షీమతకు గురైన కంపెనీ షేర్లు.. సెబీ బయటపెట్టిన ప్రమోటర్ల అక్రమాల చిట్టాతో చిత్తుచిత్తు అయ్యింది. వ్యాపారం కోసం తీసుకున్న రుణాలను అక్రమంగా పక్కదారిలో తిరిగి తమ ఖాతాల్లోకి మళ్లించుకోవటం, లగ్జరీ జీవితం కోసం చేసిన ఖర్చులు, కుటుంబ సభ్యులకు డబ్బు ట్రాన్స్‌ఫర్ వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

అయితే దేశీయ స్టాక్ మార్కెట్లో ఇలాంటి జెన్సోల్ స్టాక్స్ ఉన్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా ఈక్విటీ పెట్టుబడిదారులను హెచ్చరించారు. ప్రజల డబ్బును ముంచేసేందుకు అవి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. నష్టాలను నివారించుకోవటానికి పెట్టుబడిదారులు ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సమయం వచ్చినప్పుడు ఇలాంటి కంపెనీలు ఒక్కొక్కటిగా బయటపడతాయని, అప్పుడు తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు పెట్టిన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్ము ఆవిరైపోతుంటే చూసి ఏడవటం తప్పదని ఆయన అన్నారు. జూన్ 2024లో జెన్సోల్ పై ఆరోపణలతో సెబీ దర్యాప్తు ప్రారంభం అయ్యాక స్టాక్ 85 శాతం కుప్పకూలినప్పటికీ కొందరు అందులో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

తప్పుడు కంపెనీలకు దూరంగా ఉండటానికి కేడియా వెల్లడించిన గమనించాల్సిన విషయాలివే.. 

* ఏదైనా కంపెనీ గురించి చిన్న వార్తను కూడా మీడియాలో పెద్దదిగా చేసి చూపిస్తుంటే లేదా సోషల్ మీడియాలో ఎక్కువ ప్రచారం ఉండే షేర్లకు దూరంగా ఉండండి.
* ఏదైనా కంపెనీ ఎక్కువ సార్లు నిధుల సేకరణకు వెళుతున్నట్లయితే ఆ డబ్బును ఎలా వినియోగిస్తుందో గమనించండి. క్లారిటీ లేకపోతే అనుమానించండి.
* ట్రెండ్ చూసిన తర్వాత అకస్మాత్తుగా పూర్తిగా భిన్నమైన వ్యాపారాల్లోకి ఎంట్రీ ఇచ్చే కంపెనీలకు దూరంగా ఉండి.
* ఏఐ టెక్నాలజీ, నెక్స్‌స్ట్ జెన్ టెక్నాలజీపై పనిచేసే కంపెనీల వద్ద సరైన ఉత్పత్తి లేకపోతే వాటిని నమ్మవద్దు. 
* ప్రమోటర్ల లైఫ్ స్టైల్ కంపెనీల పనితీరు కంటే అతిగా ఉంటే ఇది ప్రమాదకరమైన సంకేతంగా గుర్తించాలి. 
* కంపెనీ ప్రమోటర్లు తమ వాటాలను తనకా పెడుతుంటే ఇది ఇబ్బందికరమైన సంకేతం కావచ్చు.
* కంపెనీ తన ఆడిటర్లను, ఉన్నత స్థాయి అధికారులు, సీఈవో, సీఎఫ్ఓలను తరచుగా మార్చుతుంటే ఏదో తప్పు జరుగుతోందని అర్థం చేసుకోవటం ముఖ్యం.
* కంపెనీ దాని ప్రమోటర్లు లేదా వారి బంధువుల కంపెనీలతో ఎక్కువగా వ్యవహరిస్తుంటే జాగ్రత్తగా ఉండండి.
* బ్యాలెన్స్ షీట్ లేదా లాభ-నష్ట ఖాతాలో ఏదైనా వింత విషయాలు కనిపిస్తే అలాంటి కంపెనీలకు దూరంగా ఉండటం ఉత్తమం. 
* ఏదైనా కంపెనీ సెబీ లేదా ఇతర రెగ్యులేటరీ సంస్థల పరిశీలన, నియంత్రణలో ఉన్నట్లయితే వాటిలీ ఈక్విటీ పెట్టుబడులు చేసే ముందు కనీసం 100 సార్లు ఆలోచించండి. తర్వాత జరిగే నష్టం పూడ్చలేనిది కాబట్టి ముందుగానే అప్రమత్తం అవ్వటం ఉత్తమం.