పోలీసులకు మద్దూరి మస్కా!..ఫాంహౌస్​​ రైడింగ్​లో టెస్ట్​కు సహకరించకుండా ముప్పుతిప్పలు 

పోలీసులకు మద్దూరి మస్కా!..ఫాంహౌస్​​ రైడింగ్​లో టెస్ట్​కు సహకరించకుండా ముప్పుతిప్పలు 
  • పాజిటివ్​ వచ్చాక వేరే మహిళ ఫోన్ నంబర్​ ఇచ్చిన విజయ్​ మద్దూరి
  • సాయంత్రం అనారోగ్యం అంటూ బయటకు.. పత్తాలేని మద్దూరి
  • 2 రోజుల గడువు కోరిన రాజ్​ పాకాల అడ్వకేట్లు

చేవెళ్ల, వెలుగు : జన్వాడ ఫాంహౌస్​ పార్టీలో కొకైన్​తీసుకున్నట్టు నిర్ధారణ జరిగిన విజయ్​మద్దూరి  పోలీసులకు మస్కా కొట్టాడు. ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు విచారణ జరిపేందుకు ప్రయత్నించగా సహకరించలేదు. తనకు ఆరోగ్యం బాగా లేదని అతడు బదులివ్వడంతో.. పోలీసులు 41ఏ నోటీసులిచ్చి సోమవారం ఉదయం రావాలని చెప్పి ఇంటికి పంపించారు. అప్పటి నుంచి ఆయన పోలీసులకు అందుబాటులో రాలేదు. రాత్రి వేళ ఓ వీడియో విడుదల చేసి, తాను చెప్పని మాటలను ఎఫ్ఐఆర్​లో నమోదు చేశారని పేర్కొన్నాడు.

వేరే మహిళ ఫోన్ నంబర్​​ ఇచ్చి..

శనివారం రాత్రి ఫాంహౌస్​ తనిఖీకి వెళ్లిన పోలీసులు డ్రగ్స్​టెస్ట్​కోసం శాంపిల్స్​ఇవ్వాలని కోరగా.. మద్దూరి 3 గంటలు వారిని సతాయించాడు. ‘‘కేటీఆర్​కు దగ్గరి వ్యక్తిని. మీరు మా ఫామ్ హౌస్​లో ఎలా రైడ్​కు వస్తారు? ఏ కేసు పెట్టారు? వారెంట్​ ఎక్కడ ఉంది? ఎవరు కంప్లయింట్​ ఇచ్చారు? నేను సాఫ్ట్​వేర్​ కంపెనీ సీఈవోను. హై ప్రొఫైల్​పర్సన్​ను. విదేశాల్లో ఉంటున్నవాడిని’’ అంటూ  విజయ్​ మద్దూరి హంగామా చేశాడు. చివరకు అతడికి టెస్ట్​చేయగా.. కొకైన్​తీసుకున్నట్టు వెల్లడైంది. పోలీసులు వెంటనే విజయ్​ ఫోన్​ అడగ్గా, తన ఫోన్​ బదులు వేరొకరి ఫోన్​ ఇచ్చాడు. రైడ్​చేసినప్పుడు విజయ్ పక్కన ఆయన భార్య ఉండగా తెలివిగా ఆమె ఫోన్ కూడా ఇవ్వకుండా..

భార్య పక్కనే ఉన్న మరో మహిళ దగ్గర కాల్​ చేసుకుంటానని చెప్పి మొబైల్ తీసుకున్నాడు. అదే మొబైల్​ను పోలీసులకు ఇచ్చాడు. తనకు కాంటాక్ట్అ వ్వాలంటే ఈ నంబర్​కు ఫోన్ చేయాలని చెప్తూ మరో మహిళ నంబర్​ఇచ్చాడు. ఆమెకు చెప్తే తనకు చెప్పినట్టేనని, క్షణాల్లో వచ్చేస్తానని చెప్పాడు. ఆ మహిళ విజయ్​ భార్య కావచ్చని పోలీసులు భావించి, అదే నంబర్​ తీసుకున్నారు. అనంతరం విజయ్​ను బ్లడ్​శాంపిల్స్​ కోసం ఉస్మానియాకు తీసుకువెళ్లి, ఆదివారం ఉదయం పదకొండున్నర వరకు మోకిలా పీఎస్​కు తీసుకువచ్చారు. అక్కడ అనారోగ్యం పేరు చెప్పిన విజయ్​ అక్కడినుంచి ఎస్కేప్​అయ్యాడు. 

రాజ్, విజయ్​కి పోలీసుల నోటీసులు 

ఫాంహౌస్​​ పార్టీ కేసులో  పోలీసులు సోమవారం రాజ్​పాకాల, విజయ్​మద్దూరికి  నోటీసులు జారీ చేశారు. రాజ్​అందుబాటులో లేకపోవడంతో ఫాంహౌస్​తో పాటు విల్లాకు నోటీసులు అంటించారు. విజయ్​నంబర్ ఇవ్వడంతో వస్తాడని ఎదురుచూశారు. అతడు ఇచ్చిన నంబర్​కు ఫోన్​చేయగా అది తనది కాదని, ఏం సంబంధం లేదని అటువైపు నుంచి సమాధానం వచ్చింది. దీంతో మస్కా కొట్టి పోయాడని గుర్తించిన పోలీసులు, విజయ్​ కోసం వెదుకుతున్నారు.

2 రోజుల తర్వాత హాజరవుతాడని..

 రాజ్​పాకాల సోమవారం విచారణకు హాజరుకాకుండా.. మధ్యాహ్నం హైకోర్టులో లంచ్​మోషన్​ పిటిషన్​ఫైల్​చేశాడు. తనను అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును ఆశ్రయించాడు. తీర్పు రాకముందే రాజ్​పాకాల అడ్వకేట్లు మోకిల పీఎస్​కు వచ్చి రాజ్​పాకాలకు రెండు రోజుల టైం కావాలని గడువు కోరారు. అనంతరం కోర్టు ఆదేశాలను పోలీసులకు చూపించి, 2 రోజుల గడువు కోరారు. అయితే  డ్రగ్స్​పాజిటివ్​ వచ్చిన విజయ్​ మద్దూరి తరఫున ఎవరూ తమను సంప్రదించలేదని సీఐ స్పష్టం చేశారు.  

మరోవైపు చేవెళ్ల ఎక్సైజ్​పీఎస్​లో ఏ1గా సూపర్​వైజర్​కార్తీక్​పై  కేసు నమోదు కాగా, ఏ2గా రాజ్​పాకాలపై కేసు నమోదైంది.అయితే, ఆదివారం రాత్రి కార్తీక్​అడ్వకేట్లు వచ్చి స్టేషన్​బెయిల్​తీసుకుని, అతడిని తీసుకువెళ్లిపోయారు. హైకోర్టు గడువు ఇవ్వడంతో రెండు రోజుల సమయం కావాలని ఎక్సైజ్​శ్రీలతను రాజ్​పాకాల అడ్వకేట్లు కోరారు. 

కేటీఆర్​భార్యను విచారించిన పోలీసులు 

శనివారం రైడ్​ చేసినప్పుడు ఫాంహౌస్​​లో కేటీఆర్​అత్తతోపాటు ఆయన భార్య శైలిమ కూడా పార్టీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. దీంతో అందరితోపాటు శైలిమనుకూడా ప్రశ్నించారు. ఈ విషయాన్ని  మోకిల సీఐ వీరబాబు ధ్రువీకరించారు.  రైడ్​ సందర్భంగా అందరి వివరాలు సేకరించామని, అందరి  ఫోన్​నంబర్లు​, పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు , ఏ ప్రాంతానికి  చెందిన వారు? అనే వివరాలు తెలుసుకుంటుండగా ఆమె కేటీఆర్​భార్య అని తెలిసిందని చెప్పారు. 

గేమింగ్​యాక్ట్​ కింద కేసు పెట్టే అవకాశం 

ఫాంహౌస్​లో రైడ్​ సందర్భంగా పత్తాలు, క్యాసినో, పోకర్​వంటివి దొరకడంతో గేమింగ్​యాక్ట్​ కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. దwర్యాప్తులో పేకాట అడినట్టు తేలితే వారిపై కేసు నమోదు చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఈ కేసులో రాజ్ పాకాల, విజయ మద్దూరి చెప్పే విషయాల ఆధారంగా కేసు ముందుకు వెళ్తుంది. పార్టీలో డబ్బులు కాకుండా కాయిన్స్ రూపంలో పేకాట ఆడినట్టు తెలుస్తున్నది.