6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు

6 వేల కోట్ల అప్పుకు..14 వేల కోట్లు వసూలు చేస్తారా:విజయ్ మాల్యా కేసు

బ్యాంకులకు అప్పు ఎగవేత కేసులో విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా  కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బ్యాంకులకు చెల్లించాల్సి అప్పులు రూ. 6వేల200 కోట్లు అయితే రూ.14వేల కోట్లు రికవరీ చేశారని బ్యాంకుల రుణాల రికవరీ ఖాతాలను తనకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాల్యా తరపున సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వాదనలు వినిపించారు. 

విజయ్ మాల్యా బ్యాంకులకు రూ. 6,200 కోట్లు తిరిగి చెల్లించాల్సి ఉండగా..రూ.14వేలకోట్లు రికవరీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ లోక్ సభకు తెలియజేశారని మాల్యా తరపు న్యాయవాది చెప్పారు.రూ.10,200కోట్లు అదనంగా రికవరీ అయ్యాయని వాదించారు. మొత్తం రుణం చెల్లించి నప్పటికీ ఇంకా కేసును కొనసాగిస్తున్నారని అన్నారు. అందువల్ల రుణం మొత్తానికి సంబంధించిన స్టేట్ మెంట్ ను బ్యాంకులు విజయ్ మాల్యాకు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 

Also Read :  రిగ్గింగ్ జరుగుతుందంటూ ఢిల్లీలో ఆందోళనలు

మాల్యా పిటిషన్ ఆధారంగా జస్టిస్ ఆర్ దేవదాస్ నేతృత్వంలోని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం బ్యాంకులు, లోన్ రికవరీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులనుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారన్న ఆరోపణలతో విజయ్ మాల్యా .. ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. ఈ కేసులో విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.