హైదరాబాద్: రాజ్యసభ సభ్యత్వానికి, తాజాగా వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి పలికిన విజయ సాయిరెడ్డి ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నారు. ఇన్నాళ్లూ రాజకీయాల్లో బిజీబిజీగా గడిపిన విజయసాయి రెడ్డి పొలిటికల్ హాలిడేస్ను ఎంజాయ్ చేస్తున్నారు. నందమూరి కుటుంబంతో విజయసాయిరెడ్డికి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి విజయసాయిరెడ్డికి మరదలి కూతురు. తారకరత్నతో పెళ్లి సందర్భంలో కూడా అలేఖ్యకు విజయసాయి రెడ్డి అండగా నిలిచారు. తారకరత్న చనిపోయిన సమయంలో ఈ వార్తలొచ్చాయి.
విజయసాయిరెడ్డి భార్య, తారకరత్న అత్తయ్య సొంత అక్కాచెల్లెళ్లు. హైదరాబాద్ నగర శివారులోని సంఘీ టెంపుల్‌లో అలేఖ్యా రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయసాయిరెడ్డి తారకరత్నకు వరుసకు మామయ్య అవుతారు. ఇలా నందమూరి కుటుంబంతో విజయసాయిరెడ్డికి బంధుత్వం ఏర్పడింది. తారకరత్న అనారోగ్యానికి గురైన సమయంలో విజయసాయిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి అలేఖ్యను పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. దురదృష్టవశాత్తూ తారకరత్న చనిపోయిన సమయంలో కూడా అతని పిల్లలను దగ్గరకు తీసుకుని విజయసాయిరెడ్డి ఓదార్చారు.
తారకరత్న పిల్లలతో విజయసాయిరెడ్డికి తాత-మనమరాళ్ల అనుబంధం ఉంది. కొత్తగా ఆయన నందమూరి కుటుంబానికి దగ్గరవుతున్నదేం లేదు. తారకరత్న పెళ్లి వల్ల విజయసాయిరెడ్డికి నందమూరి కుటుంబంతో బంధుత్వం ఎప్పటి నుంచో ఉంది. రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల్లో ఉండటం వల్ల అంతగా నందమూరి కుటుంబంతో విజయసాయిరెడ్డి దగ్గరవలేదు. ప్రస్తుతం ఆయన ఏ రాజకీయ పార్టీలో లేరు. తాజాగా.. ఆయన తారకరత్న పిల్లలతో ఆడుకుంటూ మనవరాళ్లపై ప్రేమ కురిపించారు.
తారకరత్న భార్య అలేఖ్య, ఆమె పిల్లలతో కలిసి విజయసాయి రెడ్డి కుటుంబం సమయాన్ని గడిపింది. ఈ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'వీకెండ్ విత్ విఎస్ఆర్' అని పేర్కొన్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ ఆయన మళ్లీ రాజకీయాల వైపు కన్నెత్తి చూడకపోయినప్పటికీ ఆయన కూతురు మాత్రం బీజేపీలో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.