Maharaja Movie Review: మహారాజ మూవీ రివ్యూ.. కొత్తరకం స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్

తమిళ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన లేటెస్ట్ మూవీ మహారాజ. దర్శకుడు నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సరికొత్త ఎమోషనల్ క్రైం థ్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, కీ రోల్స్ చేశారు. టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా మహారాజ నేడు (జూన్ 14) థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ: 
మహారాజ(విజయ్ సేతుపతి)... భార్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో కూతురు జ్యోతితో కలిసి ఓ సెలూన్ నడుపుకుంటూ ఉంటాడు. అయితే యాక్సిడెంట్ తన కూతురిని ఇనుప చెత్తబుట్ట కాపాడుతుంది. అందుకే ఆ చెత్తబుట్టని లక్ష్మి అని పిలుస్తూ.. ప్రేమగా చూసుకుంటాడు. కానీ, ఒకరోజు ఆ చెత్తబుట్ట కనిపించకుండా పోతుంది. వెతికిపెట్టమని పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. ఇక మరోపక్క సెల్వం(అనురాగ్ కశ్యప్) దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరి మహారాజాకు, సెల్వంకు సంబంధం ఏంటి? ఆ చెత్తబుట్టకు అంత ప్రత్యేకత ఎందుకు? అనేది తెళియాలంటే మహారాజ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
కథ రొటీన్ గా ఉన్నా మహారాజ కథనం కొత్తగా, ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ సినిమాకు అదే ప్లస్ అదే మైనస్. పాత కథని దర్శకుడు నితిలన్ సామినాథన్ చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మహారాజ పరిచయం, అతని కూతురు, చెత్తబుట్ట గురించి ఉంటుంది. ఆ నేపధ్యంలో వచ్చే కామెడీ కూడా బాగానే పండింది. ఇక ఇంటర్వెల్ లో మాత్రం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. ఇక అక్కడినుండి తరువాత ఎం జరుగుతుంది అనే ఆసక్తికలుగుతుంది. అయితే.. దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ ప్లే కారణంగా కథ ముందే అర్థమైపోతుంది. అక్కడినుండి ట్విస్టులు రివీల్ అవుతుండటంతో క్లైమాక్స్ కూడా ఊహించేస్తారు. ఇక సినిమా చివర్లో ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చి కథను ముగించారు. 

నటీనటులు, సాంకేతికనిపుణులు:
తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. మహారాజ సినిమాలో మాములు మధ్యతరగతి తండ్రి పాత్రలో ఆయన నటించాడు అనే కంటే జీవించాడు అనడం కరక్ట్. ఈ పాత్రను ఆయన మాత్రమే చేయగలడు అనేలా ఉంది. ఇక హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ రోల్ లో ఆకట్టుకుంది. సెల్వంగా అనురాగ్ కశ్యప్ తన వెరైటీ విలనిజంతో ఆకట్టుకున్నాడు. నటి అభిరామి, మమతా మోహన్ దాస్ కూడా తమ తమ పాత్రల్లో మెప్పించారు. 

ఇక సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ విజువల్స్. దినేష్ పురుషోత్తమం అందిన విజువల్స్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. అంజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. అది తెరపై కనిపిస్తుంది. మాములు కథని తన సరికొత్త స్క్రీన్ ప్లేతో చాలా బాగా ప్రెజెంట్ చేశారు దర్శకుడు. ఆ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. 

ఇక మహారాజ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. రొటీన్ కథతో వచ్చిన ఈ సినిమా సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటుంది.