విజయ డెయిరీలో ఇంటి దొంగలు..ఖమ్మం యూనిట్ లో ఔట్​ సోర్సింగ్ సిబ్బంది హవా

  • ఓపెన్​ టెండర్లు బంద్​.. నచ్చినోళ్లే డిస్ట్రిబ్యూటర్లు
  • ప్రైవేట్ కంపెనీలకు కలిసివచ్చేలా నిర్ణయాలు
  • సొసైటీల్లేవు, రైతులకు అందని ప్రోత్సాహకాలు

ఖమ్మం, వెలుగు:  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాడి రైతులకు మేలు చేయాల్సిన విజయ డెయిరీ అధికారులు ఇష్టారాప్యంగావ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్​ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో యూనిట్ ఉంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులే ఇంటి దొంగలుగా మారారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రూ.70 లక్షల విలువైన వెన్నను పక్కదారి పట్టించిన వ్యవహారంలో నలుగురు సిబ్బందిని సస్పెండ్​ చేశారు. దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేస్తున్న మరో ఇద్దరిపైనా పలు కంప్లైంట్లు వచ్చాయి. మొత్తం 56 మంది స్టాఫ్ లో 50 మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు.  డిప్యుటేషన్ల పేరుతో నచ్చిన చోటుకు కొందరిని పంపించడం, ప్రైవేట్ వ్యక్తులను ల్యాబ్​ లో నియమించుకోవడం లాంటి  ఫిర్యాదులున్నాయి.  ఉన్నతాధికారులు  శ్రద్ధ పెట్టకపోవడంతోనే పరిస్థితి ఇలా తయారైందని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు.

ఒక్కరి చేతిలోనే.. 

ఖమ్మం యూనిట్ లో పాలను హోల్​ మిల్క్​, టోన్డ్ మిల్క్, పెరుగుగా మార్చే అవకాశం ఉంది.  ఇండెంట్ మేరకు పాలను ఉంచి, మిగిలిన పాలను హైదరాబాద్​ కు తరలిస్తారు. ఈ సమయంలోనే వెన్నను పక్కదారి పట్టించి దాదాపు రూ.70 లక్షల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి నలుగురిని కొద్ది నెలల క్రితం సస్పెండ్ చేశారు.  డిస్ట్రిబ్యూషన్​ సిస్టమ్ లో దాదాపు పదేళ్లుగా నచ్చిన వారినే కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జులై 15తో ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్​ టైమ్​ ముగుస్తున్నా, ఇప్పటి వరకు  ఓపెన్​ టెండర్లు నిర్వహించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  హైదరాబాద్ లో కొందరిని మేనేజ్​ చేసుకుని ఒకరే వేర్వేరు ఫర్మ్​ ల ద్వారా డిస్ట్రిబ్యూషన్​ ను నడిపిస్తున్నారని తెలుస్తోంది. సంస్థ ప్రాంగణంలో ఉన్న పార్లర్ ను నడిపిస్తున్న వ్యక్తి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని, ఇద్దరూ జిల్లాలోని ముష్టికుంట్ల గ్రామానికి చెందిన వారేనని సమాచారం. 
ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో పార్లర్
డెయిరీ ప్రాంగణంలోనే మెయిన్​ రోడ్ పై 2016 నుంచి  ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో పార్లర్​(అవుట్ లెట్)​ నడుస్తోంది. గతంలో నెలకు రూ.5 వేలు మాత్రమే కిరాయి ఉండగా, గతేడాది దాన్ని రూ.10వేలకు పెంచారు. దీనిలో పూర్తిగా విజయ ప్రొడక్టులు మాత్రమే అమ్మాల్సి ఉండగా,​ ప్రైవేట్ ఉత్పత్తులు అమ్ముతూ పూర్తిగా బేకరీలాగా మార్చేశారు.  అవుట్ లెట్ ముందు టీ స్టాల్ పెట్టుకునేందుకు కొంత స్థలం ఇచ్చి  వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి.    డెయిరీ నుంచే కరెంట్ ను ఉపయోగించుకుంటున్నారని సమాచారం. అయితే  మామూళ్ల వ్యవహారంతోనే  ఆఫీసర్లు పట్టుంచుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. 

20 వేల లీటర్ల స్టోరేజీ

ఖమ్మం డెయిరీని  రోజూ 20 వేల లీటర్ల స్టోరేజీ కెపాసిటీతో ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు ఎప్పుడూ టార్గెట్ ను రీచ్​ కాలేదు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 33 వేల లీటర్ల సేకరణ టార్గెట్ కాగా 5,500 లీటర్ల పాలు మాత్రమే సేకరిస్తున్నారు. వర్షాలు కురిస్తే పాల సేకరణ  8 వేల నుంచి 10 వేల లీటర్లకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ డెయిరీలు 12 సెంటర్లను ఏర్పాటు చేసి రోజూ లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తున్నారని సమాచారం.  
ఓపెన్​ టెండర్ల ద్వారా ఎంపిక చేయాలి. ఖమ్మంలో విజయ డెయిరీ డిస్ట్రిబ్యూషన్​ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. అధికారుల సపోర్టుతో డిస్ట్రిబ్యూటర్​ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. దాదాపు పదేళ్లుగా డిస్ట్రిబ్యూషన్​ ఒకరిద్దరి చేతుల్లోనే ఉంది. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకున్న వారికే డిస్ట్రిబ్యూషన్​ ను అప్పగిస్తున్నారు. ఈ ఏడాదైనా ఓపెన్ టెండర్లు నిర్వహించాలి. - వెంకటనారాయణ, రిటైల్​ వ్యాపారి​ 

నేను వచ్చాక ఎలాంటి అక్రమాలు జరగడం లేదు 

మూడు నెలల క్రితం ఖమ్మంలో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాను. అంతకు ముందు జరిగిన అక్రమాలకు సంబంధించి కొందరిని సస్పెండ్ చేశారు. రెగ్యులర్​ ఉద్యోగులు లేకపోవడంతో, ఔట్​ సోర్సింగ్ సిబ్బందిపైనే ఆధారపడుతున్నాం. డిస్ట్రిబ్యూటర్​ ఎంపిక మా చేతిలో లేదు. ఓపెన్​ టెండర్ల నిర్వహణపై ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి. 
- కుమార స్వామి, డిప్యూటీ డైరెక్టర్​, విజయ డెయిరీ