
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ప్రణాళికాబద్ధంగా వ్యాపార విస్తరణకు అడుగులు వేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం నగరం బుర్హాన్ పురం పాత డీఆర్డీఏ ఆఫీస్ రోడ్డు ప్రక్కన ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్ ను కలెక్టర్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా విజయ డెయిరీ పార్లర్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన పాల పదార్థాలు విక్రయిస్తూ మంచి లాభాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ డీడీ మోహన్ మురళీ, విజయ డెయిరీ పార్లర్ నిర్వాహకులు మదార్, డిస్ట్రిబ్యూటర్లు నరేశ్, జగదీశ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయం
ప్రజల జీవన వ్యవస్థ సజావుగా జరిగేందుకు కృషి చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ అన్నారు. ఖమ్మం బస్సు డిపోలో ఆర్టీసీ సిబ్బందికి కలెక్టర్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీరంలో రక్తం ఎంత ముఖ్యమో ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ కూడా అంతే ముఖ్యమన్నారు.
ఇఫ్తార్ విందుకు హాజరు..
ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం విడివోస్ కాలనీలోని టీఎన్జీవోస్ భవన్ లో జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, ముస్లిం మైనార్టీ సోదరులు, అన్ని ఉద్యోగ సంఘ నాయకులతో కలెక్టర్ నమాజ్ ఆచరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.