
మాఘమాసం కృష్ణ పక్షం ఏకాదశికి విజయ ఏకాదశి అంటారు. మహాశివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి. విజయ ఏకాదశికి చాలా విశిష్టత ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 తేదీ సోమవారం విజయ ఏకాదశి జరుపుకొనున్నారు. విజయ ఏకాదశి వ్రతం పాటించి లక్ష్మీనారాయణులకు అరటిపండ్లను సమర్పిస్తే.. మంచి ఉద్యోగం లభించడంతో పాటు.. కష్టాలు తీరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
విజయ ఏకాదశి ( ఫిబ్రవరి 24 సోమవారం) ఉపవాస దీక్షను పాటించాలి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే ప్రతి పనిలో విజయం సాధించడంతో పాటు.. మరణం తరువాత మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 24 విజయ ఏకాదశి రోజున తెల్లవారుజామున నదిలో స్నానం చేయాలి. అవకాశం లేని వారు ఇంట్లో బావి వద్ద గాని.. కుళాయి వద్దగాని స్నానమాచరించాలి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా గంగా జలంకాని..పుణ్య నదుల తీర్థం కాని కలుపుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.
పూజా విధానం
ఇంట్లో పూజా పూజామందిరాన్ని శుభ్రం చేసి.. ఆవుపేడతో అలికి.. ముగ్గు పెట్టి.. పీట వేసి.. పసుపు వస్త్రం పరిచి లక్ష్మీనారయణుల పటాన్ని కాని.. విగ్రహాన్ని కాని ఉంచాలి. స్వామి దగ్గర ఆవునెయ్యితో కాని.. నువ్వుల నూనెతో కాని దీపారాధన చేయాలి. తరువాత పంచామృతాలతో అభిషేకం చేయాలి. తరువాత స్వామికి వస్త్రం కట్టి.. పసుపు.. కుంకుమ.. గంధం ... పూలతో పూజ చేయాలి. తులసి దళాలను స్వామి వారికి సమర్పించాలి. ధూపం వేసి. అరటి పండ్లను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి.
స్వామి వారి పూజలో భాగంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి.. లక్ష్మీ దేవిని పూజించాలి. విజయ ఏకాదశి వ్రత కథను పారాయణం చేయాలి. “ఓం నమో భగవతే వాసుదేవాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి. విష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
విజయ ఏకాదశి ప్రాముఖ్యత
విజయ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి ఎల్లప్పుడూ విజయం లభిస్తుంది. ఈ వ్రతం పాటించడం వల్ల పూర్వం రాజులు, చక్రవర్తులు చాలా యుద్ధాలలో విజయం సాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం ఆచరించి విష్ణువుని పూజించిన వారికి శత్రువులు ఎటువంటి పరిస్థితుల్లో కలిగించిన వాటి నుంచి బయటపడగలుగుతారు. బాధల నుంచి విముక్తి కలుగుతుంది. గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఏకాదశి రోజు పఠించాల్సిన మంత్రాలు
- ఓం నారాయణాయ లక్ష్మీ నమః... అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల మంచి ఉద్యోగం పొందుతారు.
- ఓం సీతాపతే రామ్ రామాయ నమః.. అనే మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి.
- ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి.
ఏకాదశి రోజు చేయాల్సిన పనులు
- విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి.
- రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
- ఉపవాసదీక్షను పాటించాలి.
- విష్ణుమూర్తికి పసుపు, కుంకుమ, అరటిపండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల దాంపత్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- ఆరోజు ( ఫిబ్రవరి 24) న వీలయినంతవరకు దానాలు చేయండి.
- రోజంతా భగవత్ ధ్యానంలో గడపాలి..
- కింద చాప కాని.. దుప్పటి కాని వేసుకొని పడుకోవాలి.
ఏం చేయకూడదు
- విజయ ఏకాదశి నాడు అన్నం తినకూడదు.
- అబద్ధాలు చెప్పకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు మరింత పెరుగుతాయి.
- సాత్విక ఆహారాన్ని ( పాలు.. పండ్లు) తీసుకోవాలి.
- మాంసం, ఆల్కహాల్, ఉల్లిపాయలు, లేదా వెల్లుల్లి తీనకూడదు... ధూమపానం చేయకూడదు.
- ఎవరిని కించపరచకూడదు.. అవమానించకూడదు.
- ఏ జీవికి ఎలాంటి హాని తలపెట్టకూడదు.
- మంచంపై కూర్చోకూడదు.. పడుకోకూడదు..