హైదరాబాద్, వెలుగు: ప్రతి ఇంటి నుంచి 100శాతం చెత్త సేకరణ చేసి సిటీని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు రెయిన్ కోట్ లను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ప్రతి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు తమకు కేటాయించిన ఏరియాలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ క్రమం తప్పకుండా సేకరించాలని ఆదేశించారు.
ALSO READ :లిక్కర్ అమ్మితే రూ.10 వేలు ఫైన్
రూల్స్ కు విరుద్ధంగా చెత్తను బయట పారవేసే వారిపైనా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఆరోగ్య రక్షణకు రబ్బరు గ్లౌస్ లను అందించడం జరుగుతుందని, డ్రెస్ కోడ్ టీ-షర్టులను, హెల్త్ కార్డులతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో నూ హైదరాబాద్ ను ముందంజలో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శానిటేషన్ ఉపేందర్, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు