విజయ పాల సేకరణ ధరలు పెంపు! ఆవు, బర్రె పాలు లీటరుకు ఎంత పెరగనుందంటే..

విజయ పాల సేకరణ ధరలు పెంపు! ఆవు, బర్రె పాలు లీటరుకు ఎంత పెరగనుందంటే..
  •  రూ.3 చొప్పున పెంచేలా ప్రతిపాదనలు
  • ప్రతినెలా 5, 20వ తేదీల్లో బిల్లులు చెల్లింపు 
  • రూ.50 కోట్ల పెండింగ్ బకాయిల రిలీజ్​కూ నిర్ణయం  

హైదరాబాద్, వెలుగు: రైతుల నుంచి విజయ డెయిరీ సేకరిస్తున్న పాల ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఆవు పాలతో పాటు బర్రె పాల సేకరణ ధరలను సవరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేట్, సహకార డెయిరీలతో పోలిస్తే.. విజయ డెయిరీ ఎక్కువ మొత్తంలోనే చెల్లిస్తోంది. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న పాల లభ్యత, మార్కెట్​పరిస్థితులకు అనుగుణంగా రేట్లను పెంచాలని సర్కారు నిర్ణయించింది. 

ఇతర ప్రైవేటు, సహకార డెయిరీలతో పోలిస్తే విజయ తెలంగాణ డెయిరీ ఆవు పాలకు దాదాపు రూ.8–9 ఎక్కువగానే చెల్లిస్తోంది. ఆవు పాలపై ఒక్కో లీటర్ కు రూ. 2 నుంచి రూ. 3 ఎక్కువ ఉండేలా చూస్తూ, ప్రస్తుత ధర సుమారు రూ. 42.24ను సవరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బర్రె పాల రేటును ప్రస్తుత లీటరు రూ 48.00  నుంచి రూ.51.00 దాకా పెంచే ప్రతిపాదన కూడా ఉంది. విజయ తెలంగాణ డెయిరీ ఇప్పటికే మూడు దఫాలుగా పాల ధరలను పెంచింది. దీంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి, సేకరణ గణనీయంగా పెరిగింది. 

గత ఏడాదిగా దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి పెరిగింది. పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి అతి తక్కువ ధరకు పాలు అందుబాటులో ఉండటంతో, మార్కెట్లో పాల ధర సేకరణ గణనీయంగా తగ్గింది. దీంతో ప్రైవేట్ డెయిరీలు, కొన్ని కోఆపరేటివ్ డెయిరీలు పక్క రాష్ట్రాల నుంచి లీటర్ కు రూ. 27 నుంచి రూ. 32 చొప్పున పాలను సేకరించి, మార్కెటింగ్ కమీషన్లను పెంచి రాష్ట్రంలో అమ్మకాలను పెంచుకుంటున్నాయి. దీని ప్రభావం విజయ తెలంగాణ అమ్మకాలపై పడుతోంది. 

విజయ పేరుతో అక్రమ డెయిరీలు.. 

విజయ పేరుతో కొన్ని డెయిరీలు అక్రమంగా పాల అమ్మకాలు జరుపుతుండటం వల్ల కూడా విజయ తెలంగాణ డెయిరీ పాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. విజయ తెలంగాణ అమ్మకాలు తగ్గి ప్రతి రోజు సుమారు 2.8 లక్షల లీటర్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో ప్రతి నెలా పాడి సమాఖ్య రూ. 12 కోట్లు నష్టపోతోంది. దీంతో పాడి రైతులందరికీ పాల బిల్లుల చెల్లింపులలో జాప్యం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో డెయిరీ యాజమాన్యం పాడి రైతులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దాదాపు రూ.50 కోట్ల పాత బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించింది. ప్రతి నెలా 5వ తేదీ, 20వ తేదీన పాల బిల్లులు చెల్లించాలని సమావేశం నిర్ణయించింది.