సుల్తానాబాద్, వెలుగు: మానేరు తీరంలో అడ్డగోలుగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌లను మూసివేసేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ లో మంగళవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 116 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా సమస్యను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లానని, సాంకేతిక ఇబ్బందులను తొలగించి రీచ్‌ల మూసివేతకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాను అడ్డుకోవద్దని అధికారులకు సూచించారు. ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 28 నుంచి జరిగే గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు శివపల్లి గ్రామంలో విశ్వబ్రాహ్మణ పురోహితుల సంఘం సభ్యులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించి ఆశీర్వాదాలు అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ మినుపాల స్వరూప, ప్యాక్స్‌చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, లీడర్లు ప్రకాశ్‌రావు, అన్నయ్య గౌడ్, అబ్బయ్య గౌడ్, సతీశ్, పన్నాల రాములు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు
పాల్గొన్నారు.