మునుగోడు ఉప ఎన్నిక మిగతా ఎన్నికలకు భిన్నమని బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. మునుగోడులో గందరగోళ వాతావరణం నెలకొందన్నారు. లెంకలపల్లి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకోవడం సంతోషకరమన్న ఆమె.. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటప్పుడు దొర నువ్వు ఎక్కడున్నావ్ అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ పార్లమెంట్ లో అడ్రస్ లేకుండా పోతే.. తాను మాత్రమే బిల్లు పాస్ అయ్యే వరకు పార్లమెంట్ లో ఉన్నానని చెప్పారు. అసలు రాష్ట్రంలో అభివృద్ధి అనేది చేసి ఉంటే మునుగోడులో ఎన్నికలు వచ్చేవి కావన్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయశాంతి ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయి
తెలంగాణలో రోడ్లు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.850 కోట్లు వచ్చాయని.. ఆ డబ్బులన్నీ ఏం చేశారని విజయశాంతి ప్రశ్నించారు. రోడ్లు వేసేందుకు కేంద్రం 60 శాతం ఇస్తే.. రాష్ట్రం 40 శాతం నిధులు వేసి రోడ్లు వేయాలి కాని కేంద్రం ఇచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో రోడ్లు ఎందుకు వేయలేదని ప్రజలు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 8 ఏళ్లుగా వాగులపై బ్రిడ్జిలు కూడా నిర్మించలేదన్నారు.
రైతుల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది ఏళ్లలో 8వేల మంది రైతులు చనిపోయారని విజయశాంతి అన్నారు. కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి రైతులకు దక్కాల్సిన సొమ్ము తీసుకెళ్లి.. ఇతర రాష్ట్ర రైతులకు కేసీఆర్ పంచి పెడుతున్నాడని ఆమె అన్నారు. వరి వేస్తే ఉరి అంటూ రైతుల పంటలపై ఎందుకు నియంత్రణ పెట్టావని ప్రశ్నించారు. బతుకమ్మ చీరల పేరుతో 30 రూపాయల చీరలు ఇచ్చి ఆడబిడ్డలను అవమానిస్తావా అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో మరో అబద్దం చెప్పి ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని విజయశాంతి ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ లో చేరినప్పుడే కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. లెంకలపల్లి గ్రామానికి ఇంచార్జిగా ఉంటే.. కేసీఆర్ ఇక్కడ బస చేసి గ్రామస్తులు అందరినీ తాగుబోతులను చేసి పోతాడని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు.