యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు కొండపైన ప్రధానాలయ బ్రహ్మోత్సవ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా శమీ పూజలు జరిపారు. ఈ పూజల్లో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి దంపతులు, ఈవో గీతారెడ్డి భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామివారికి గజవాహన సేవ నిర్వహించి ఆయుధ పూజ చేశారు.
ఇక యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పర్వత వర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం)లో తొమ్మిది రోజులుగా జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. ఉదయం సహస్రనామార్చన, గాయత్రీ జపాలు, పారాయణాలు, నిత్య హవనం, మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, సాయంత్రం విజయదశమి, శమీ పూజ నిర్వహించారు.