![అసెంబ్లీలోనూ రియల్ కెప్టెన్ : జయలలితకు నాలుక మడతెట్టి వార్నింగ్ ఇచ్చిన విజయకాంత్](https://static.v6velugu.com/uploads/2023/12/vijayakanth-faced-jayalalitha-face-to-face-in-the-assembly-why-is-the-tongue-sticking-out_WcOfXvy5Cd.jpg)
తమిళనాడులో ఏఐఏడీఎంకే-డీఎంకేలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోయినా.. రాష్ట్రంలో మార్పు తెస్తానని చెబుతూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కెప్టెన్ విజయకాంత్. 2005 సెప్టెంబర్ 14వ తేదీన దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం(డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు. 2006లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయగా కేవలం విజయకాంత్ ఒక్కరే వృధాచలం నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఇక 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసింది డీఎండీకే. మొత్తం 41 నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయగా 29 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష హోదాను పొందారు. అప్పుడు సీఎంగా ఉన్న జయలలితతో ఢీ అంటే అంటే ఢీ అనే స్థాయికి ఎదిగారు విజయకాంత్. శాసనసభలో జయలలిత, విజయకాంత్ మధ్య చాలా సార్లు వాగ్వాదం జరిగింది.
ఓ సారి శాసనసభలో డీఎండీకే నేత చంద్రకుమార్ అసెంబ్లీలో మాట్లాడుతూ బస్సు ఛార్జీల గురించి ప్రశ్న లేవనెత్తారు. దీనికి జయలలిత సమాధానం చెప్పారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ధరల పెంపును ఎందుకు ప్రకటించలేదని విజయకాంత్ జయలలితను ప్రశ్నించారు. దీనిపై జయలలిత స్పందిస్తూ త్వరలో శంకరన్‌కోయిల్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని . ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఒంటరిగా నిలిచి విజయం సాధిస్తుందని... మరి ఒంటరిగా పోటీ చేసే బలం డీఎండీకే పార్టీకి ఉందా? అని ప్రశ్నించారు.
దీనిపై విజయకాంత్ స్పందిస్తూ.. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా గెలుస్తుందో అందరికీ తెలుసుంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఆ సమయంలో అన్నాడీఎంకే నేతలు కేకలు వేయడంతో కోపోద్రిక్తుడైన విజయకాంత్ నాలుక మడతెట్టి జయలలిత ముందే ఆమె పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదంపై రాజకీయ వర్గాల్లో అప్పట్లో జోరుగా చర్చ సాగింది.