గుట్టు విప్పేశారు: జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీపై తల్లి విజయమ్మ సంచలన విషయాలు

గుట్టు విప్పేశారు: జగన్, షర్మిల ఆస్తుల పంచాయితీపై తల్లి విజయమ్మ సంచలన విషయాలు

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తులపై ఆయన వారసులు వైఎస్ జగన్, షర్మిలకు గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ గొడవ ఇటీవల మరింత ముదిరి జగన్, షర్మిల బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో జగన్, షర్మిల మధ్య నెలకొన్న ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్ అభిమానులకు ఆమె మంగళవారం (అక్టోబర్ 29) బహిరంగ లేఖ రాశారు. రాజశేఖర్ రెడ్డి, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాధేస్తుందని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదని.. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని.. అబద్దాల పరంపర కొనసాగుతుందన్నారు. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్న మాటలు దావాలనంగా ఎక్కడెక్కడికో పోతున్నాయని.. ఇకపై ఇవి కంటిన్యూ అవ్వకూడదని అన్నారు. నా పిల్లలిద్ధరికీ కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదన్నారు. నేను మీ ముందుకు ఈ విషయంపై మాట్లాడేందుకు రాకూడదని అనుకున్నా.. కానీ రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ‘‘ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా.. ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి కుటుంబం. 

రాజశేఖర్ రెడ్డి మేము ఎంతో.. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా  ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే  ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు.. రాజశేఖర్ రెడ్డి మన మధ్యనుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ.. హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను’’ అన్నారు. దయచేసి వైఎస్ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా.. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దని విజ్ఞప్తి చేశారు. జగన్, షర్మిల సమస్యను పరిష్కరించుకుంటారు. మీరెవరు రెచ్చ గొట్టవద్ధని మనవి చేశారు.

విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా.. మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్న.వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, వైఎస్ఆర్ ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ గారి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం.

నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న YSR గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం.  YSR గారి చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట. ‘నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని’ అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది "నాలో నాతో YSR అనే పుస్తకం"లో ఎప్పుడో రాశా. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డి కి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు’’  అని కీలక విషయాలు వెల్లడించారు. 

‘‘జన్మనిచ్చిన  ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్దాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే... అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు.  అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి..  నా మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తూ.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది’’ అని అన్నారు.