వైసీపీ అధినేత జగన్ వీర విధేయుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. హస్తిన కేంద్రంగా మెగా బ్రదర్స్తో బీజేపీ ఏపీలో ఆట మొదలుపెట్టిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ అధిష్టానం ఇప్పటికే కీలక పదవి ఆఫర్ చేసిందని, పవన్ను ముందు నిలిపి టీడీపీతో పనిలేకుండానే ఏపీలో బీజేపీ ముందుకెళ్లాలని చూస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీకి ‘కాపు’ కాసేది పవనేనని బీజేపీ అధినాయకత్వం బలంగా నమ్ముతోంది. బీజేపీ పట్ల పవన్ ఏకపక్ష సానుకూల వైఖరి కూడా బీజేపీలో ఈ నమ్మకాన్ని మరింత పెంచుతోంది. అమిత్ షా నుంచి పవన్కు పిలుపొచ్చిందని.. రేపోమాపో పవన్ హస్తిన పర్యటన ఖాయమని జోరుగా చర్చ నడుస్తోంది.
ఏపీలో ఒంటరిగా ఎదగాలన్న కల పవన్ సాయంతో సాకారం చేసుకోవాలని బీజేపీ హైకమాండ్ ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని బీజేపీ అమలుచేస్తోందని, కాపులను బీజేపీకి దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగా పవనాస్త్రాన్ని ‘కమలం’ పార్టీ ప్రయోగిస్తుందని ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీతో మున్ముందు కూడా రాజకీయంగా ముప్పు ఉంటుందనే భావనలో ఉన్న బీజేపీ అటు నుంచి నరుక్కొస్తుందనే వాదనను కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు. బీజేపీ ఎత్తుగడలో భాగంగానే ఏపీ పాలిటిక్స్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్తో ఈ వాదన మరోసారి తెరపైకొచ్చింది.
జగన్ నమ్మిన బంటు విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకే పరిమితమైన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణాలు చాలానే మారాయి. జగన్ సమీప బంధువు బాలినేనితో పాటు అప్పటి వరకూ వైసీపీ కీలక నేతలుగా వ్యవహరించిన పలువురు రాజీనామా చేయడంతో వైసీపీలో కల్లోలం రేగింది. అయితే.. రాజ్యసభ సభ్యత్వానికి, రాజకీయాలకు విజయ సాయి రెడ్డి గుడ్ బై చెప్పడం మాత్రం అనూహ్య పరిణామమనే చెప్పాలి. ఈ పరిణామం వైసీపీ కేడర్కు ఊహించని ఝలక్ అని చెప్పక తప్పదు. బీజేపీకి అమిత్ షా, టీడీపీకి అచ్చెన్నాయుడు ఎలానో వైసీపీకి విజయసాయి రెడ్డి అంత కీలకమైన వ్యక్తి. ఢిల్లీలో వైసీపీ తరపున రాజకీయంగా చక్రం తిప్పిన ఉద్ధండుడు. కష్టకాలంలో కూడా జగన్కు వెన్నంటే ఉన్న నేత. వైసీపీకి వీర విధేయుడు. ఇంతటి వైసీపీ కరుడుకట్టిన నేత ‘‘రాజకీయం వద్దు.. వ్యవసాయం ముద్దు’’ అని నిర్ణయం తీసుకోవడం వెనుక కూడా రాజకీయమే ఉందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ALSO READ | రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా
హస్తిన కేంద్రంగా బీజేపీ ఏపీ రాజకీయం షురూ చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. 2029లో బీజేపీ ఏపీలో ఒంటరి పోరుకు సిద్ధమైందని.. అందుకు సంబంధించిన సన్నాహాలను ఇప్పటి నుంచే మొదలుపెట్టిందనే ప్రచారం జోరందుకుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాలతో ఖాళీ కానున్న స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలను కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనకు బీజేపీ అధిష్టానం కుండబద్ధలు కొట్టి మరీ చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే.. వైసీపీని గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వీలైనంత బలహీనపడేలా చేసి తద్వారా లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని, ఈ పరిణామం ఏపీ బీజేపీకి కలిసొస్తుందని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.
ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను రాజకీయ విశ్లేషకులు ఏ విధంగా అంచనా వేస్తున్నారంటే..
మెజారిటీ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఏపీ రాజకీయాలను, కులాలను వేరుగా చూడలేమన్నది రాజకీయ విశ్లేషకుల బలమైన అభిప్రాయం. ఏపీ రాజకీయాలను విశ్లేషిస్తున్న విశ్లేషకుల అంచనా ఎలా ఉందంటే.. ఆంధ్రాలో ప్రధాన రాజకీయ పార్టీలకు కొన్ని సామాజిక వర్గాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయనేది కూడా జగమెరిగిన సత్యం. టీడీపీకి ఎప్పటి నుంచో ఒక ప్రధాన సామాజిక వర్గం, వైసీపీకి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు అండగా నిలిచిన మరో ప్రధాన సామాజిక వర్గం అండగా ఉంటూ వచ్చాయి. ఇప్పటికీ అండగానే ఉన్నాయి. పవన్ జనసేనకు కూడా ఒక సామాజిక వర్గం ‘కాపు’ కాస్తుంది. ఒక్క బీజేపీకి మాత్రమే ఒక బలమైన సామాజిక వర్గం అండదండలు ఏపీలో లేకుండా పోయాయి.
బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ మనుగడ కోసం 2024లో కూటమి పార్టీలతో జతకట్టడం బీజేపీకి అనివార్యమైంది. అయినప్పటికీ కేంద్రంలో శాసించే శక్తిగా ఉండటంతో కూటమి పార్టీల సీట్ల పంపకాలు కూడా బీజేపీ కోరుకున్నట్టే జరిగాయి. 2029లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల గేమ్ ప్లాన్ను బీజేపీ ఇప్పటి నుంచే మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఏపీలో ఇంకెలాంటి రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయనే ఆసక్తి నెలకొంది.