విజయసాయి ట్వీట్ జగన్ను ఉద్దేశించిందేనా..? ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ ఇదే..

విజయసాయి ట్వీట్ జగన్ను ఉద్దేశించిందేనా..? ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ ఇదే..

‘‘రాజకీయాల్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి.. క్రెడిబులిటీ అనే పదానికి అర్థం తెలిసి ఉండాలి.. ప్రలోభాలు, భయంతో క్యారెక్టర్ తగ్గించుకోవద్దు.. విజయసాయి సహా ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. ఎవరు వీడినా సరే పార్టీ ఉంటుంది.. కష్టం అనేది ఎల్లకాలం ఉండదు.. ఐదేళ్ల పాటు ఓపిక పడితే మన సమయం వస్తుంది.. ఓపిక, సహనం, వ్యక్తిత్వం అనేది ఉండాలి’’ వైసీపీని వీడిన రాజ్యసభ ఎంపీలపై జగన్ గురువారం (ఫిబ్రవరి 7, 2025) చేసిన వ్యాఖ్యలివి..

జగన్ చేసిన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ వేదికగా విజయసాయిరెడ్డి స్పందించారు. ‘‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది.

విజయసాయి రెడ్డి వైసీపీని వీడిన సందర్భంలో కూడా జగన్పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ‘‘వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి  గారికి పంపించాను. 2029 ఎన్నికల్లో శ్రీ వైయస్ జగన్ గారు భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించాను’’ అని వైసీపీని వీడిన సమయంలో విజయసాయి ట్వీట్ చేశారు. 

జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని కోరుకున్న విజయసాయిరెడ్డి.. తాజాగా జగన్ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే పరోక్షంగా కౌంటర్ ఇచ్చినట్టుగా ట్వీట్ చేయడంపై ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.