వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనవరి 25న స్పీకర్ ఫార్మాట్ లో ఢిల్లీలో రాజీనామా లేఖను జగదీప్ ధన్కడ్ కు అందజేశారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని జనవరి 24న విజయసాయి రెడ్డి తన ఎక్స్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంలో ఎవరి బలవంతం లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిళ్లు లేవని క్లారిటీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉన్నానని అన్నారు. జగన్ కు మంచి జరగాలని ఆకాంక్షించారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ , రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు.
రైతుగా మారి వ్యవసాయం..
విజయసాయి రెడ్డి మరో పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. ఆయన వ్యవసాయానికే పరిమితమవుతారని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి తన ప్రకటనలోనూ వెల్లడించారు. తన భవిష్యత్తు వ్యవసాయమేనని అన్నారు.