స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును విచారించేందుకు.. రెండు రోజుల సీఐడీ కస్టడీకి ఇస్తూ బెజవాడలోని ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కస్టడీ విచారణ జరగాలని ఆదేశించింది. 2023, సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది కోర్టు.
ఏపీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ కొట్టివేసిన గంటలోనే.. ఏసీబీ కోర్టు కస్టడీ పిటీషన్ పై తీర్పు వెల్లడించింది. ఈ రెండు తీర్పుల కంటే ముందే.. మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్ ను రెండు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు విడుదలయ్యాయి. ఇదే సమయంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ సైతం వాయిదా పడింది. ఈ బెయిల్ పిటీషన్ విచారణను సెప్టెంబర్ 25వ తేదీ అంటే సోమవారం విచారించనున్నట్లు స్పష్టం చేసింది కోర్టు.
Also Read : 310 ఫార్మాసిస్టుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వటం, క్వాష్ పిటీషన్ కొట్టివేయటంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు చంద్రబాబు తరపు లాయర్లు
సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా..చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజులు సీఐడీ కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును అక్కడే విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపే విచారించాలని సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది.
ఇక ఏసీబీ కోర్టు మూడు కండీషన్లతో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించాలని విజయవాడ ఏసీబీ కోర్టు తెలిపింది. విచారణ నివేదికను సీల్డ్ కవరులో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణ చేసే వీడియోలు, ఫొటోలు బయటకు రాకూడదంటూ.... విచారించే అధికారుల వివరాలను కోర్టుకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 23,24 తేదీల్లో రాజమండ్రి జైల్లో ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారించాలని చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తామంటూ.. కస్టడీ మగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలని కోర్టు ఆదేశించింది.