కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ .. ట్యాక్స్‌‌ చెల్లించాలని విజయవాడ కమర్షియల్ ఆఫీసు నుంచి నోటీస్

కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ .. ట్యాక్స్‌‌ చెల్లించాలని విజయవాడ కమర్షియల్ ఆఫీసు నుంచి నోటీస్
  • ట్యాక్స్‌‌ చెల్లించాలని విజయవాడ కమర్షియల్ ఆఫీసు నుంచి నోటీస్
  • సైబర్  నేరస్తుల పని అయి ఉంటుందని అనుమానం

చండ్రుగొండ, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన ఓ వ్యవసాయ కూలీకి ఏపీలోని విజయవాడ కమర్షియల్‌‌ ట్యాక్స్‌‌ ఆఫీస్‌‌ షాక్‌‌ ఇచ్చింది. రూ.22 లక్షల జీఎస్టీ చెల్లించాలంటూ అతనికి నోటీస్‌‌ పంపడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు. చండ్రుగొండ గ్రామానికి చెందిన జానపాటి వెంకటేశ్వర్లు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 4న పోస్ట్‌‌ ద్వారా విజయవాడలోని కమర్షియల్‌‌ ట్యాక్స్‌‌ ఆఫీస్‌‌ నుంచి అతడికి ఓ నోటీసు వచ్చింది. 

విజయలక్ష్మి ఎంటర్‌‌ ప్రైజెస్ పేరిట  కోటి రూపాయల గ్రానైట్‌‌ వ్యాపారం చేశారని, సదరు వ్యాపారానికి సంబంధించి 2022లో జీఎస్టీ కట్టలేదని, ఇందుకు ఫైన్‌‌తో కలిపి మొత్తం రూ.22,80,014 చెల్లించాలని అందులో పేర్కొన్నారు. దీంతో ఆందోళనకు గురైన వెంకటేశ్వర్లు కొందరు గ్రామస్తులు, స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్లి విజయలక్ష్మి ఎంటర్‌‌ ప్రైజెస్ ఎవరిదని ఆరా తీయగా ఆ అడ్రస్‌‌తో ఆఫీసే లేదని తేలింది. 2022లో తనకు పాన్‌‌ కార్డే లేదని, తనకు తెలియకుండానే తన పేరుతో వ్యాపారానికి లైసెన్స్ ఎలా వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ పోలీస్‌‌ కమిషనర్‌‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు తెలిపాడు.