విజయవాడలో ఓ డాక్టర్ ఫ్యామిలీ మొత్తం మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.. గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ శ్రీనివాస్ సహా ఆయన కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
గురునానక్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్థోపెడిక్ డాక్టర్ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీనివాస్ కుటుంబంలోని ఐదుగురు మృతి చెందారు. శ్రీనివాస్ కుటుంబం మృతిపై పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో డాక్టర్ శ్రీనివాస్ మృతదేహం ఉంది.హత్యా? ఆత్మహత్య అన్న కోణంలో పోలీసుల విచారణ జరుపుతున్నారు. మృతుల్లో దంపతులు, ఇద్దరు పిల్లలు, వృద్ధురాలు ఉన్నారు. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఆయన భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
మంగళవారం ( ఏప్రిల్ 30) ఉదయం పది గంటల తర్వాత ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఉదయం శ్రీనివాస్ ఇంట్లో వారిని చూసినట్టు స్థానికులు చెబుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ నగరంలో శ్రీజ ఆర్థోపెడిక్ ఆస్పత్రిని నిర్వహించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల గొంతు కోసి హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. ఇంట్లోని గదుల్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు.
ఆర్థిక సమస్యలతో ఆస్పత్రిని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక కుటుంబ సభ్యుల్ని హతమార్చి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సీపీ రామకృష్ణ పరిశీలించారు. శ్రీనివాస్ బంధువుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.