- ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- మంత్రి కోమటిరెడ్డితోకలిసి ఏర్పాట్ల పరిశీలన
- ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలునిర్వహించనున్న ప్రభుత్వం
- లక్ష మందితో ఆవిష్కరించనున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం లక్ష మంది సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఏర్పాట్లను ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి రేవంత్ పరిశీలించారు.
బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ మహిళలా తెలంగాణ తల్లి రూపం ఉన్నది. చేతిలో మక్కజొన్న, వరి, జొన్న సజ్జలను ఉంచారు. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లను పెట్టారు. రాష్ట్రంలోని సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
కాంస్య విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా.. విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియెట్ ప్రాంగణానికి తరలించారు. మరో 3 అడుగులతో కిందిగద్దె రూపొందించారు. సుమారు ఐదున్నర కోట్ల రూపాయలతో తెలంగాణ తల్లి విగ్రహం, పరిసరాల్లో ఫౌంటెయిన్, పచ్చిక బయళ్లను తీర్చిదిద్దారు. తెలంగాణ తల్లి విగ్రహం మారినప్పటికీ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా, జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లి చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది.
ప్రతి ఏటా తెలంగాణ తల్లి ఉత్సవాలు
రాష్ట్ర సచివాలయం ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గతంలోనే సీఎం రేవంత్ నిర్ణయించారు. డిసెంబర్ 9న ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే వెల్లడించారు. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని ప్రకటించారు. కాగా, సెక్రటేరియెట్లో సోమవారం నిర్వహించనున్న సభ ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిశీలించారు. ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సీఈ రాజేశ్వర్ రెడ్డికి పలు సూచనలు చేశారు.