ISSF వరల్డ్‌ కప్‌లో విజయ్‌వీర్‌కు గోల్డ్‌ మెడల్‌

ISSF వరల్డ్‌ కప్‌లో విజయ్‌వీర్‌కు గోల్డ్‌ మెడల్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌: పారిస్‌ ఒలింపియన్‌ విజయ్‌వీర్‌.. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో ఇండియాకు నాలుగో గోల్డ్‌ అందించాడు. బుధవారం జరిగిన మెన్స్‌ 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఫైనల్లో విజయ్‌వీర్‌ 29 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో నిలిచి స్వర్ణం సాధించాడు. లో స్కోరింగ్‌ ఫైనల్లో ఇండియన్‌ షూటర్‌ చివరి మూడు రౌండ్లలో అద్భుతమైన గురితో ఆకట్టుకున్నాడు. రికార్డో మజ్జట్టి (ఇటలీ, 28), యాంగ్‌ యుహవో (చైనా, 23) వరుసగా సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. 

తొలి 20 టార్గెట్స్‌లో రికార్డో మజ్జట్టి14  పాయింట్లు నెగ్గితే విజయ్‌వీర్‌ 13తో సరిపెట్టుకున్నాడు. ఫస్ట్ ఎలిమినేషన్‌ తర్వాత పుంజుకున్న విజయ్‌వీర్‌ మూడుసార్లు ఫోర్లు, ఓ పర్ఫెక్ట్‌ ఫైవ్‌తో మజ్జట్టిని రెండు పాయింట్లు వెనక్కి నెట్టి టాప్‌లోకి దూసుకొచ్చాడు. ఏడో సిరీస్‌ వరకు ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా సాగినా ఎనిమిదో సిరీస్‌లో మజ్జట్టి మూడు పాయింట్లే సాధించాడు. 

ఇండియన్‌ షూటర్‌ నాలుగు పాయింట్లు నెగ్గడంతో గోల్డ్‌ సొంతమైంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో రుద్రాంక్ష్‌ పాటిల్‌–ఆర్యా బోర్సె సిల్వర్‌ మెడల్‌ను నెగ్గారు. ఫైనల్లో ఇండియా జోడీ 9 పాయింట్లు సాధించగా, చైనా షూటర్లు జిఫీ వాంగ్‌–బుహన్‌ సాంగ్‌ 17 పాయింట్లతో గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా నాలుగు గోల్డ్‌తో కలిపి ఏడు మెడల్స్‌ను సాధించింది.