వికారాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల నిర్వహణలో నోడల్ అధికారులదే కీలకపాత్ర అని కలెక్టర్ నారాయణ రెడ్డి స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికలకు నియమించిన నోడల్ అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నోడల్ అధికారులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. నోడల్ టీంలు, పీఓ, ఏపీఓలకు కూడా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే అమలుకు సంబంధించిన చర్యలపై ముందుకెళ్లాలని సూచించారు. జిల్లాలో చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, డ్యూటీలో పొరపాట్లు చేయకుండా ఎన్నికల నియమావళిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పోలీస్ సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యానాయక్, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాసులు, నోడల్ అధికారులు, డీఎస్పీలు, సీఐలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.